నగర అభివృద్ధికి చిత్తశుద్ధితో చర్యలు మంత్రి తుమ్మల

30 కోట్లతో ఖమ్మం ఖిల్లా రోప్ వే పనులు

దశల వారీగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి తుమ్మల

ఖమ్మం ప్రతినిధి జనవరి 17 (ప్రజాబలం) ఖమ్మం నగర అభివృద్ధికి చిత్తశుద్ధితో చర్యలు చేపట్టామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. శుక్రవారం మంత్రి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ బల్లేపల్లి జయనగర్ కాలనీలో ఎల్.ఆర్.ఎస్. నిధులు 2 కోట్లతో చేపట్టిన సైడ్ డ్రైన్ నిర్మాణం, ఖమ్మం ఇల్లందు ఆర్ అండ్ బి రోడ్డు నుండి ఎస్సి కాలని చర్చి వరకు జయనగర్ కాలనిలో రోడ్డు పురోగతి పనులు, టి.యు.ఎఫ్.ఐ.డి.సి.నిధులు ఒక కోటి 25 లక్షలతో 3 వ డివిజన్ నందు సి.సి.రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ,  అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో దివంగత కార్పొరేటర్ జగన్ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని, ఆయన డివిజన్ లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు గతంలో ఖానాపురం, బల్లెపల్లి బాలాపేట్ నుంచి ఖమ్మం పట్టణంలో వచ్చిన వరద నివారణకు 200 కోట్లతో సర్ ప్లస్ నీరు ధంసలాపురం మీదుగా మళ్ళీ మున్నేరు వెళ్ళే విధంగా కాలువ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామని అన్నారు. ఖమ్మం ఖిల్లా, వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధికి చర్యలు ప్రణాళికలు చేపట్టామని, ఈ రోజు వెలుగుమట్ల అర్బన్ పార్క్ కు 3 కోట్లు మంజూరు చేశామని అన్నారు. ఖమ్మం ఖిల్లా రోప్ వే ద్వారా సందర్శకులు వెళ్లేందుకు, పర్యాటక కేంద్రంగా తయారు చేసేందుకు 30 కోట్లతో పనులు చేపట్టామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జనవరి 26 నుంచి అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, నూతన రేషన్ కార్డుల జారీ కార్యక్రమాలను ప్రారంభిస్తామని అన్నారు. మొదటి దశలో అత్యంత పేదలకు ప్రభుత్వ సహాయం అందుతుందని, తరువాత దశలవారీగా అర్హులందరికీ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటామని, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఉగాది నుండి రేషన్ కార్డుల క్రింద సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సంవత్సరం మన జిల్లాలో లక్ష టన్నులు అధికంగా ధాన్యం సేకరణ జరిగిందని అన్నారు.

       

సన్న రకం ధాన్యానికి 500 రూపాయలు బోనస్ అందించామని అన్నారు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, నూతన వైద్య కళాశాల జిల్లాకు రావడంతో పాటు జిల్లా ఆసుపత్రిలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, అలాగే మన పి.హెచ్.సి. లు, ఏరియా ఆసుపత్రిలను మంత్రి చొరవ వల్ల అభివృద్ధి చేసుకుంటూ పోతున్నామని అన్నారు విద్యా రంగంలో మన పిల్లలు అద్భుతంగా ఎదగాలనే ఆకాంక్షతో జిల్లాలో 60 ఉన్నత పాఠశాలలో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు ప్రవేశ పెట్టామని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ఎప్పటికప్పుడు అవసరమైన మౌళిక వసతులు కల్పించుకుంటూ పోతున్నామని అన్నారు. జిల్లాలో 575 కోట్ల రూపాయలతో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, 160 కోట్ల బోనస్ ఇచ్చామని అన్నారు. భక్త రామదాసు, నాగార్జున సాగర్, ఇతర ఎత్తిపోతల పథకాల క్రింద సాగు సజావుగా అందేలా చర్యలు చేపట్టామని అన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర రావు ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు ఆర్థిక అండ్ బి ఈ ఈ యుగంధర రావు కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking