వర్షాల నేపథ్యంలో మూసీ నీటి మట్టాలపై నిఘా కొనసాగిస్తూ పరివాహక ప్రజలను అప్రమత్తం చేయాలి
వర్షాల సమయంలో మూసి తో పాటు వరద ప్రాంతాలకు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్
హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: హైదరాబాద్, ఆగస్టు 13 , 2025: నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మూసి పరివాహక ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా , లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవార ఉదయం జీహెచ్‌ఎంసీ కమిషనర్ మూసారాంబాగ్ , మలక్ పేట సర్కిల్ ల పరిధిలో సంబంధిత డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్లు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పర్యటించారు.

మూసారాంబాగ్ వంతెన సహా ప్రగతి లో ఉన్న నిర్మాణ పనులను పరిశీలించారు.
మూసి వెంబడి ప్రయాణిస్తూ నీటి ప్రవాహ ఉధృతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అధికారులు తీసుకున్న ముందస్తు చర్యలు, జాగ్రత్తలను సమీక్షించారు.
మూసారాంబాగ్ బ్రిడ్జి పనుల పురోగతిని పరిశీలించిన ఆయన, ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని అన్నారు. టౌన్ ప్లానింగ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖలు సమన్వయంతోభద్రత ప్రమాణాలు నిక్కచ్చిగా పాటిస్తూ, వర్షాకాలంలో కనెక్టివిటీనీ పెంచుతూ రవాణా సౌకర్యాలు మెరుగుపరిచే కీలక ప్రాజెక్టులను వేగవంతం చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ అధికారులకు సూచించారు.
నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా మూసీ నీటి మట్టాలు పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, సమీప ప్రాంతాల ప్రజల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
వర్షాకాలంలో ప్రజల రక్షణే మా ప్రాధాన్యం. ప్రతికూల వాతావరణంలోనూ ప్రాజెక్టులను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలి’’ అని కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఈ సందర్భంగా తెలిపారు.
మూసీ నది పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అధికారిక హెచ్చరికలను గమనిస్తూ , భారీ వర్షాల సమయంలో వరద ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ అన్నారు.