పొంగులేటి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావ్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్

ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిక
హైదరాబాద్ /ఖమ్మం ఆగష్టు 17 (); కాంగ్రెస్‌ నేత మాజీ ఎంపీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్య అనుచరుడు అయిన తెల్లం వెంకట్రావ్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చారు. నిన్న మొన్నటి వరకు పొంగులేటితో నడుస్తూ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన ఆయన.. అంతర్గత విబేధాలతో కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌ కుమార్‌, బీఆర్‌ఎస్‌ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు సమక్షంలో హైదరాబాద్‌లో తన అనుచరులతో కలిసి ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల నుంచి కూడా పలువురు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ స్వభావం తెలుసుకోవడానికి తెల్లం వెంకట్రావుకు నెలకంటే ఎక్కువ సమయం పట్టలేదని అన్నారు.తెల్లం వెంకట్రావు 2014లో మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఆయన అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి బీఆర్‌ఎస్‌ భద్రాచలం భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 సాధారణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కొన్నినెలల నుంచి పొంగులేటితో కలిసి తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన నాటి నుంచి అక్కడి నేతల వ్యవహారశైలితో తెల్లం ఇబ్బందిపడ్డారని తెలుస్తున్నది. తన రాజకీయ భవిష్యత్తుపై పొంగులేటి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని, పార్టీ వ్యవహారాల్లో తనకు స్థానం కల్పించకపోవడం, పార్టీ ఒంటెద్దుపోకడలు అనుసరించడం వంటి కారణాలతో తెల్లం వెంకట్రావు పార్టీని వీడుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో చేరిన కొద్దిరోజుల్లోనే పొంగులేటి ముఖ్యఅనుచరుడు పార్టీని వీడడం ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశమైంది. తెల్లం వెంకట్రావ్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడడం పొంగులేటికి అపప్రధ అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking