భాగ్యనగర్ ఉత్సవ కమిటీ, అధికారులతో నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి (ప్రజాబలం)సెప్టెంబర్ 12:
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతామని ఈ విషయంలో అధికారులు సమన్వయంతో పకడ్భందీ ప్రణాళిక ప్రకారం వ్యవహరించాలని జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి అన్నారు.
మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, మల్కాజిగిరి డీసీపీ గిరిధర్, భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు, జిల్లా స్థాయి అధికారులు , మున్సిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి మాట్లాడుతూ వినాయక నిమజ్జనానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 17 చెరువులు ఉండగా అందులో గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) పరిధిలో 11 చెరువులు ఉండగా
జీహెచ్ఎంసీ పరిధిలోకి రాని 6 చెరువులు ఉన్నాయని వివరించారు. వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకోవటంతో పాటు నిమజ్జనం చేసుకునేందుకు అవసరమైన రూట్ మ్యాప్ సైతం సిద్ధం చేసుకొని అందుకు అవసరమైన రూట్లలో రోడ్డు మరమ్మతు పనులు వెంటనే చేపట్టి పూర్తి చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. వినాయక నిమజ్జనానికి వినియోగించే వాహనాలను ముందస్తుగా రవాణా శాఖ అధికారులు సర్టిఫై చేయాలని ప్రతి గణేష్ మండపం వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, గణేష్ నిమజ్జనం సజావుగా జరిగే విధంగా కట్టుదిట్టమైన భద్రత ఉండేలా ఏర్పాట్లు చూడాలని అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి తెలిపారు. నిమజ్జన ప్రదేశాలలో గతంలో కంటే అధిక సంఖ్యలో గజ ఈతగాళ్ళను అందుబాటులో ఉంచాలని జిల్లా మత్స్య శాఖ అధికారికి అదనపు కలెక్టర్ సూచించారు.
. గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని తాగునీరు, విద్యుత్తు, పారిశుద్ధ్యం, మెడికల్, లైటింగ్ వంటి సౌకర్యాలు ఉండేలా చూడాలని తెలిపారు. గణేష్ నవరాత్రులు ముగించి నిమజ్జనం చేసే సందర్భంలో అగ్ని మాపక శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సమావేశంలో స్పష్టం చేశారు. వినాయక నిమజ్జన స్థలాల వద్ద భారీ క్రేన్లు ఏర్పాటు చేయాలని నిమజ్జనానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్తు శాఖ అధికారులు ఇప్పటి నుంచే అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రతి నిమజ్జన స్థలం వద్ద అదనపు ట్రాన్స్ఫార్మర్లు, పవర్ జేనరేటర్లను ముందు జాగ్రత్తగా అందుబాటులో ఉంచడంతో పాటు వినాయక నిమజ్జన సమయంలో విద్యుత్ తీగల సమస్య ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు తీసుకొని అవసరమైన చర్యలను తీసుకోవాలని అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో పాటు నిమజ్జనం చేసే ప్రదేశాలలో అవసరం మేరకు వైద్య శిబిరాలను, ఫస్ట్ ఎయిడ్ కిట్లతో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా జిల్లా వైద్యాధికారి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. అలాగే జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో శానిటేషన్కు సంబంధించి చూడాలని సమావేశంలో అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి సూచించారు. జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జన ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులకు తావులేకుండా ఇప్పటి నుంచే అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలిపారు. దీంతో పాటు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు పలు సమస్యలను అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి దృష్టికి తీసుకురాగా వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ఈ ఉత్సవాలను కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సహకారంతో కలిసికట్టుగా అందరూ సహకరించి ప్రశాంతంగా జరిగేలా చూడాలని అదనపు కలెక్టర్ ఆకాంక్షించారు ఈ సమీక్ష సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, మల్కాజిగిరి డీసీపీ గిరిధర్, భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు, జిల్లా స్థాయి అధికారులు, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, తహశీల్దార్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.