ప్రజా తెలంగాణ అభివృద్ధికి సహకారం చేసే మా ప్రయత్నంలో కలసి వస్తున్న వారందరికి ప్రజా పాలన దినోత్సవ శుభుకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ అండ్ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండ రెడ్డి.
మెదక్, సమీకృత కలెక్టరేట్ కార్యాలయం
ప్రజాబలం దినపత్రిక మెదక్ జిల్లా ప్రతినిధి 17,09,2024:
తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవము జరుపుకుంటున్న శుభ సందర్భంగా రాచరిక వ్యవస్థ నుండి ప్రజా పాలనా వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికిన అమరులైన తెలంగాణ సాయుధ, రైతాంగ పోరాట యోధులకు మరియు స్వాతంత్ర్య సమరయోధులు అందరికీ నా జోహార్లు …
సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు, తెలంగాణ ప్రాంతం భారత్ యూనియన్ చేరి ప్రజా పాలన మొదలై నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలోకి అడుగిడుతున్న శుభసందర్భంగా హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, ఉద్యమకారులకు, కార్మిక, కర్షక, విద్యార్థినీ, విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు.
నేడు ఈ స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం మన సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డ మీద అసమాన త్యాగాలు చేశారు. ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణా అభివృద్ధికి నాంది పలికింది. దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర సంబరాల్లో కేరింతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్య్ర్యానికై పోరాడుతూనే ఉన్నారు. నాటి హైదరాబాదు సంస్థానం 16 జిల్లాలతో తెలుగు, మరాఠీ, కన్నడ భాషల మిశ్రమ సంస్కృతులతో కూడిన సంస్థానంగా ఉండేది. హైదరాబాద్ సంస్థానం స్వతంత్రంగా ఉంటుంది అని నైజాం రాజు ప్రకటించి రాచరిక పాలనను కొసాగించారు.
రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మొదటిసారి అసువులు బాసిన దొడ్డి కొమురయ్య గారి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రతరమైనది. ఆనాటి పోరాటంలో తెలంగాణ మహిళలైన శ్రీమతి చాకలి ఐలమ్మ, శ్రీమతి మల్లు స్వరాజ్యం , శ్రీమతి ఆరుట్ల కమలా దేవి కీలక పాత్ర పోషించారు. నల్లగొండ జిల్లా నుంచి బండి యాదగిరి రాసిన “బండెనకబండి కట్టి పదహారు బండ్లు కట్టి.. ఏ బండ్లో పోతావు కొడుకో.. నైజాం సర్కారోడో…” పాట సాయుధ పోరాటాన్ని ఉధృతం చేసి రాచరిక ప్రభుత్వం పై తిరుగుబాటు చేయడానికి ప్రజల్లో చైతన్యం రగిలించింది. ప్రపంచ పోరాటాల చరిత్రలో తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది.
అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ,మరియు హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయాలని నిజాం రాజుకు రాయబారం పంపారు.
భారత సైన్యం రంగంలోకి దిగడంతో అప్పటి నిజాం రాజు భారత యూనియన్ లో విలీనానికి అంగీకరించాడు. 1948 సెప్టెంబరు 17 సాయంత్రం డెక్కన్ రేడియోలో ఇండియన్ యూనియన్ లో చేరుతానని ప్రకటించారు. ఆ రోజు నుంచి నాటి హైదరాబాద్ రాష్ట్రంలో ప్రజా పాలన ప్రారంభం అయింది.

తెలంగాణ మలిదశ ఉద్యమం ఆత్మగౌరవ నినాదాలతో 1969లో మొదలై సుదీర్ఘకాలం కొనసాగి ఎంతోమంది అమరవీరుల ప్రాణత్యాగాల అనంతరం 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసుకుంది.
ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా ప్రజల సంక్షేమం కోసం, జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పధకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను.
ప్రజా పాలన:
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అదికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలుచేయడం ప్రారంభించింది. ఇందిరమ్మ గ్రామసభలు నిర్వహించి ప్రజల నుంచి ధరఖాస్తులు స్వీకరించి పధకాలు అమలు చేస్తున్నాం.
రాష్ట్రంలో ఆడపడుచులకు మరియు ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్నీ ప్రభుత్వం అమలు చేస్తుంది. మహిళలు పైసా ఖర్చు లేకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఈ పథకం ద్వారా లబిస్తుంది. మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 1 కోట్ల 31 లక్షల మంది మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారుదీని ద్వారా మహిళలకు 38 కోట్ల 75 లక్షల రూపాయల లబ్ది చేకూరింది.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలుచేయడంతో పాటు, ఈ పథకం ద్వారా పేదలకు కార్పోరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాం. ఈ పథకం ద్వారా మెదక్ జిల్లాలో 10 వేల 722 మంది పేదలు చికిత్సలు పొందగలిగారు, అందుకు గాను ప్రభుత్వం 25 కోట్ల 6 లక్షల రూపాయలు ఖర్చు చేసింది.
నిరుపేదలు ప్రతి ఒక్కరికి సొంత ఇంటికల నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ లక్ష్యాన్ని సాదించే క్రమంలో ఇందిరమ్మ ఇళ్ళ పధకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తుంది. ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో ఈ ఒక్క సంవత్సరములోనే 4 లక్షల 50 వేల గృహాలు నిర్మించతలపెట్టాం. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 3,500 గృహాలు నిర్మించడం జరుగుతుంది.
నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడకూడదన్న సంకల్పంతో మహాలక్ష్మి పథకం ద్వారా కేవలం 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేసే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 1 లక్ష 22 వేల 672 మంది వినియోగదారులకు 2 లక్షల 53 వేల 125 గ్యాస్ సిలిండర్లు పంపిణి చేయడం జరిగింది. దీనికిగాను ప్రభుత్వం 7 కోట్ల 18 లక్షల రూపాయల సబ్సిడీ అందించింది.
గృహజ్యోతి కార్యక్రమం ద్వారా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది. మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 1 లక్ష 24 2 370 మంది వినియోగదారులకు జీరో బిల్లు జారి చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం జిల్లాలో ఇప్పటివరకు 23 కోట్ల 54 లక్షల సబ్సిడి అందచేసింది.
దేశంలో ఎన్నడు జరగని రీతిలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకు
రైతుల రుణమాఫిచేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. 2 లక్షల రూపాయలు వరకు
ఏకకాలంలో ఋణ మాఫీ చేయడంతో రాష్ట్రలోని రైతాంగం నేడు పండగ జరుపుకుంటుంది. మెదక్
జిల్లాలో రైతు రుణమాఫీ పథకం ద్వారా మొత్తం 86 వేల 919 మంది రైతన్నలకు 638 కోట్ల 9 లక్షల రూపాయల రుణమాఫీ జరిగింది.

శాంతిభద్రతల పరిరక్షణలో, నేరాలు నిరోదించడంలో, రహదారుల ప్రమాదాల నివారణలో అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసు యంత్రాంగానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
జిల్లాను ప్రగతి పథంలో నడిపించి, అభివృద్ధి కోసం ఎల్లవేళల అంకిత భావంతో పనిచేస్తున్న ప్రజా ప్రతినిధులకు, జిల్లా యంత్రాంగానికి, వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి జిల్లా ప్రజలకు, స్వాతంత్ర్య సమరయోధులకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలకు తగు ప్రచారం కల్పించి ప్రజాలలోకి తీసుకువెళ్తున్న ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ సోదరులకు, అట్టడుగువర్గాలదాకా అభివృద్ధి ఫలాలను చేరవేసి ” ప్రజా తెలంగాణ” అభివృద్ధికి సహకారం చేసే మా ప్రయత్నంలో కలసి వస్తున్న వారందరికి మరోమారు ప్రజా పాలన దినోత్సవ శుభుకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను.