భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి జూన్ 8 (ప్రజాబలం) కొత్తగూడెం గురువారం నిర్వహించనున్న ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఊరూరా చెరువులు పండుగ కార్యక్రమం నిర్వహణపై ఆయన బుధవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామం, మండలం, జిల్లాస్థాయిలో ఊరూరా చెరువు కార్యక్రమాన్ని జరపాలని చెప్పారు. చెరువుకట్టపై కట్టమైసమ్మ పూజలు చేయాలని చెప్పారు. సాయంత్రం 5 గంటలకు చెరువుల పండుగ నిర్వహించాలన్నారు. గ్రామం నుంచి డప్పులు, బోనాలు, బతుకమ్మలు, మత్స్య కారుల వలలతో ఊరేగింపుగా బయలుదేరాలని చెప్పారు. గ్రామంలోని రైతులు, మత్స్య కారులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలు చెరువు కట్టకు చేరుకోవాలని, చెరువు గట్టుపై పండుగ వాతావరణం ప్రతిఫలించేలా ముగ్గులు, తోరణాలతో అందంగా అలంకరించాలన్నారు. కట్ట మైసమ్మపూజ, చెరువు నీటికి పూజలు చేయాలని, తదనంతరం సభ, సాంస్కృతిక కార్యక్రమాలు బతుకమ్మ, కోలాటాలు, పాటలు, గోరేటి వెంకన్న రాసిన చెరువోయి.. మా ఊరి చెరువు తదితర చెరువు పాటలు వినిపించాలన్నారు. ఇరిగేషన్ లో వచ్చిన ప్రగతి, తద్వారా పెరిగిన పంటల ఉత్పత్తి వివరాలు, మత్స్య సంపద, భూగర్భ జలాల పెరుగుదల, తదితర వివరాలను తెలియజేస్తూ, ఫ్లెక్సీలు పెట్టాలని, కరపత్రాలు పంచుటతో పాటు చదివి వినిపించాలని చెప్పారు. ప్రజా ప్రతినిధులు, ప్రజలు కలిసి చెరువుకట్ట మీద సహపంక్తి భోజనాలు చేయాలని, భోజనాలు ఏర్పాటులో నాణ్యత పాటించాలని చెప్పారు. ప్రజలు చెరువుల్లోకి వెళ్లకుండా రక్షణ చర్యలు పాటించాలని చెప్పారు