సాగునీటి రంగంలో చారిత్రక పురోగతి సాధించాం…… శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ టి.భాను ప్రసాద్ రావు

 

*ప్రతి గ్రామంలో నీటితో మిషన్ కాకతీయ చెరువులు కళకళలాడుతున్నాయి

*ప్రపంచంలో భారీ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం రికార్డు సమయంలో పూర్తి చేశాం

*సాగునీటి రంగానికి స్వర్గీయ విద్యాసాగర్ రావు చేసిన సేవలు చిరస్మరణీయం

*ప్రభుత్వ కార్యాచరణ ఫలితంగా పెద్దపల్లి జిల్లాలో 30 శాతం పెరిగిన సాగు విస్తీర్ణం

*రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన సాగు నీటి దినోత్సవ వేడుకల్లో పాల్గోన్న శాసనమండలి ప్రభుత్వ చీప్ విప్, జిల్లా కలెక్టర్, పెద్దపల్లి ఎమ్మెల్యే

పెద్దపల్లి ప్రజాబలం జూన్ – 7:

రాష్ట్రంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సాగునీటి రంగంలో చారిత్రక పురోగతి సాధించామని శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ టి.భాను ప్రసాద్ రావు అన్నారు.

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం పెద్దపల్లిలోని నందన గార్డెన్స్ లో నిర్వహించిన సాగునీటి వేడుకలలో ప్రభుత్వ చీఫ్ విప్ భాను ప్రసాద్ రావు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు.

తాగునీటి రంగంలో రాష్ట్రం సాధించిన పురోగతి వివరాలను వివరిస్తూ రూపొందించిన పుస్తకాలను ముఖ్యఅతిథి శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్, జిల్లా కలెక్టర్, పెద్దపల్లి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ప్రభుత్వం సాగునీటి రంగంలో చేపట్టిన మిషన్ కాకతీయ, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, చెక్ డాంల నిర్మాణాలను తెలియజేస్తూ రూపొందించిన వీడియోలను వేడుకలో ప్రదర్శించారు.

శాసనమండలి ప్రభుత్వ చీఫ్ విప్ టి. భాను ప్రసాద్ రావు మాట్లాడుతూ, 1969 ఉద్యమ సమయంలో ఉద్యోగాలు, నిధుల నినాదం ఉండేదని, ఆ తరువాత మన ప్రాంతాలలో గొలుసు కట్టు చెరువులు, నీటి వనరులను ధ్వంసం చేస్తూ గ్రామీణ జీవితాలను అతలాకుతలం చేశారని అన్నారు. ఉమ్మడి పాలనలో గంగాళంలా ఉన్న మన చెరువులను తాంబాలం లా మార్చారని ఆవేదన చెందామని ఆయన గుర్తు చేశారు.

ఉద్యమ సమయంలో ప్రజలను మభ్య పెట్టే దిశగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు చేపట్టినప్పుడు ఆన్ రికార్డు ఈ ప్రాంతానికి పనికి రాదని, నీళ్ళు రావని చెప్పడం జరిగిందని, కేంద్రంలో రాష్ట్రంలో మహారాష్ట్రలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రాణహిత వద్ద పనులు చేపట్టలేదని ఆయన గుర్తు చేశారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రాంత అవసరాలు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దార్శనికతతో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నారని, రికార్డ్ సమయంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో ముందస్తుగా చిన్న నీటిపారుదలపై ప్రత్యేక దృష్టి సారించి ఉమ్మడి రాష్ట్రంలో ధ్వంసమైన చెరువుల పునరుద్ధరణ దిశగా కాకతీయ రాజుల స్ఫూర్తితో మిషన్ కాకతీయ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని, రాజకీయాల కతీతంగా ప్రతి చెరువు పునరుద్ధరణ పనులు చేపట్టి తాంబాలంలో ఉన్న చెరువులను మరోసారి గంగాళం లా మార్చారని ఆయన తెలిపారు.

పెద్దపల్లి జిల్లాలో సైతం 218 కోట్లను ఖర్చు చేసి 650 చెరువులను పునరుద్ధరించారని అన్నారు. *మిషన్ కాకతీయ కారణంగా మండు వేసవి కాలంలోనూ గ్రామాలలోనీ చెరువులు నీటితో కళకళలాడుతున్నా యని , వాగులు పొంగి పొర్లుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి రంగంలో జరిగిన పురోగతి, అభివృద్ధి లో నీటిపారుదల నిపుణులు స్వర్గీయ విద్యాసాగర్ రావు చేసిన కృషి చిరస్మరణీయమని ప్రభుత్వ చీఫ్ విప్ తెలిపారు.

కాళేశ్వరం లాంటి భారీ ఎత్తుపోతల ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు సృష్టించిన అపోహలు అనుమానాలను పటాపంచలు చేస్తూ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని, అందుకోసం వారు చేసిన కృషి ప్రశంసనీయ మని ఆయన కొనియాడారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు జరిగిన వ్యయం పై జరుగుతున్న దుష్ప్రచారాలపై ప్రభుత్వ చీఫ్ విప్ మండిపడ్డారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో రెండు రిజర్వాయర్లు 2 టీఎంసీలతో సామర్థ్యం తో ఉంటే, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో 15 రిజర్వాయర్లను 147 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించుకున్నామని, గతంలో భూ నిర్వాసితులకు ఎకరానికి 50 వేలు ప్రతిపాదిస్తే, నేడు ఆరు లక్షల నుంచి 12 లక్షల వరకు పరిహారం అందించామని, నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగిన దృష్ట్యా కాళెశ్వరం వ్యయం పెరిగిందని అన్నారు.

మన దేశంలో 140 కోట్ల జనాభా ఉందని, కరువు వచ్చిన పరిస్థితులలో మన దేశానికి ఆహారం అందించే సామర్థ్యం ప్రపంచంలో ఎవరికీ లేదని, భగవంతుడు అందించిన నీటి వనులను, ప్రతినీటి బొట్టు సమర్థవంతంగా వినియోగించుకుంటూ శాశ్వతంగా కరువును పారద్రోలి దిశగా సీఎం కేసీఆర్ పటిష్ట అడుగులు వేశారని అన్నారు.

స్వతంత్ర భారతదేశంలో మరే రాష్ట్రంలో జరగని విధంగా సీఎం కేసీఆర్ త్రాగునీటి కష్టాలను తీర్చారని, ఇతర రాష్ట్రాలలో సగం గ్రామాలకు కూడా త్రాగునీరు అందని పరిస్థితి ఉంటే మన దగ్గర ప్రతి ఇంటికి త్రాగు నీరు, వ్యవసాయానికి సాగు నీరు అందించి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని ఆయన పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్ట చర్యలá1i కారణంగా పెద్దపెల్లి జిల్లాలో సాగు విస్తీర్ణం ఒక లక్షా 80 వేల ఎకరాల నుంచి 2 లక్షల 86 వేల ఎకరాలకు చేరిందని , దాదాపు 30 శాతం సాగు విస్తీర్ణం పెరిగిందని అన్నారు.

చిన్న నీటిపారుదల రంగంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 218 కోట్లతో 650 చెరువులను పునరుద్దరించామనిఅన్నారు. ఎస్సారెస్పీ కాలువల ఆధునీకరణ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ ఫలితంగా రైతులు ప్రతి సంవత్సరం రెండు పంటలు సాగు చేస్తున్నారని , ప్రతి సీజన్ లో మూడు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అన్నారు.

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, మానవ జీవితంలో నీరు జీవాధారం, ప్రాణాధారమని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సాగునీటి రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించారని, ముందస్తుగా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టి పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలో 339 చెరువులను 82 కోట్ల 29 లక్షలతో పునరుద్ధరించి 27 వేల 286 ఎకరాల ఆయకట్టుకు నీరంధించడం జరిగిందని అన్నారు.

ప్రస్తుతం వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించడంలో, చివరి ఆయకట్ట వరకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం సఫలీకృతమైందని, భారీ నీటి ప్రాజెక్టులు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం వల్ల వేసవికాలంలో చెరువులో మత్తడ్లు దూకుతున్నాయని అన్నారు. ఎస్సారెస్పీ డీ 83, డి 86 కాలువలలో గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించామని , వరద కాలువ నుంచి ఫీడర్ చానల్ ద్వారా కాకతీయ కాలువలో 98 కిమి వద్ద లింకు కెనాల్ తో కలిపి డీ 83, డి 86 కాలువల ఆయకట్టు స్థిరీకరించామని అన్నారు.

గతంలో ఎడారిగా ఉన్న ప్రాంతాన్ని సీఎం కేసీఆర్ సస్య శ్యామలం చేశారని, ప్రస్తుతం పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలో ఇంచుభూమి ఖాళీ లేకుండా రెండు పంటలు సాగు చేస్తున్నామని, ధాన్యం దిగుబడి మూడు రెట్లు పైగా పెరిగిందని అన్నారు.
సాగునీటి వ్యవస్థ పునర్వ్యవస్థీకరించి రామగుండంలో ఈఎంసి కార్యాలయం ఏర్పాటు చేశారని, సాగునీటి నిర్వహణలో సైతం మార్పులు తీసుకువచ్చి సాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకొని వ్యవసాయాన్ని పండుగ చేశారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, జిల్లా ప్రజా పరిషత్ వైస్ చైర్ పర్సన్ రేణుక, జడ్పిటిసిలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking