చివరి ఆయకట్టుకూ సాగు నీరందిస్తాం

 

మాది రైతు పక్షపాత ప్రభుత్వం

అందుకే వరుణదేవుడు కరుణించి ప్రాజెక్టులు నింపి దీవించాడు

కేసీఆర్ ధరణి తో రైతులు పదేళ్లు గోస పడ్డారు

సాగు భూముల పరిష్కారానికి ఆదర్శంగా మేము త్వరలో కొత్త పథకం ప్రారంభిస్తాం

రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి

పాలేరు రిజర్వాయర్ నుంచి పాతకాల్వకు, భక్త రామదాసు ప్రాజెక్టు నుంచి ఆయా మండలాలకు సాగు జలాలు విడుదల చేసిన శీనన్న

పాలేరు నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 3 (ప్రజాబలం) కూసుమంచి ఈ వ్యవసాయ సీజన్ కాలానికి ఆయకట్టు పరిధిలో చివరి ఎకరాకు కూడా సాగునీరు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఆయన పాలేరు రిజర్వాయర్ వద్ద కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఎన్నెస్పీ అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి గేటు ఎత్తి పాతకాల్వకు జలాలు విడుదల చేశారు. అనంతరం ఎర్రగడ్డ వద్ద భక్త రామదాసు ఎత్తిపోతల పథకం నుంచి ఈ ప్రాజెక్టు పరిధిలోని మండలాల కు సాగునీరు విడుదల చేశారు. ఇక్కడ ప్రాంగణంలో మొక్క నాటాక.. మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చాక.. దేవతల దీవెనలు కూడా దక్కి..మంచి వర్షాలు కురిశాయని, కృష్ణా పరివాహక పరిధిలో శ్రీశైలం నిండిందని, నాగార్జున సాగర్ పూర్తి దశకు చేరిందని అన్నారు. గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జూలై చివరి నాటికి నాగార్జునసాగర్ లోకి ఈ స్థాయిలో జలాలు చేరలేదని అన్నారు. సాగర్ కాల్వ వెంట లోటుపాట్లు తెలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఎన్ ఎస్ పీ అధికారులను ఆదేశించారు.

రైతులకు మేలు చేయాలన్నదే మా లక్ష్యం

రాష్ట్రంలోని రైతులకు మేలు చేయాలని, వారిని రాజులను చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్షమని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అందుకే రూ.31 వేల కోట్లతో రుణమాఫీని అమలు చేస్తున్నామని అన్నారు. దేశంలో ఇంత తక్కువ కాలంలో సాగుదారుల సంక్షేమానికి కృషి చేసిన ప్రభుత్వo మరొకటి లేదని తెలిపారు

అప్పుడంతా భారమే

గత బీఆర్ఎస్ పాలనలో రూ. 7లక్షల 16 వేల కోట్ల అప్పుల భారాన్ని ప్రజలపై మోపారని మంత్రి పొంగులేటి విమర్శించారు. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీకున జీతాలు ఇవ్వలేని దుస్థితి ఉండేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రోజుకు 16, 17 గంటలు కష్టపడుతూ.. ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తెస్తున్నామని అన్నారు

ధరణి.. ఇక బంగాళాఖాతంలోకే

గత ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలిసి.. రైతులను నిలువునా ముంచేలా.. ధరణి ని ప్రవేశపెట్టి రైతులను గోస పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక దీనిని బంగాళాఖాతంలో కలిపేస్తామని.. అప్పటి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రకటించారని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తమ ప్రభుత్వం జాతీయ స్థాయిలో సర్వే చేపట్టి.. అందరికీ ఆమోదయోగ్యంగా.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే సరికొత్త పథకాన్ని త్వరలోనే ప్రవేశపెడతామని ప్రకటించారు ఈ కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు రామ సహాయం నరేష్ రెడ్డి, చావా శివరామకృష్ణ, తిరుమలాయపాలెం జెడ్పీటీసీ బెల్లం శ్రీనివాస్, కూసుమంచి, తిరుమలాయపాలెం ఎంపీపీలు బాణోతు శ్రీనివాస్, బోడా మంగీలాల్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మట్టే గురవయ్య, మాజీ ఎంపీపీలు జూకూరి గోపాలరావు, కొప్పుల అశోక్, నాయకులు జొన్నలగడ్డ రవి, బజ్జూరి వెంకటరెడ్డి, మంకెన వాసు, రామిరెడ్డి, అజ్మీర అశోక్ నాయక్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking