మాదిగల విశ్వరూప మహా పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ
ఎంఎస్పీ జిల్లా కన్వీనర్ దూమాల గంగారాం
జగిత్యాల, అక్టోబర్ 4: ఎస్సి వర్గీకరణపై నిర్ణయం తీసుకోకుండా మాదిగలకు అన్యాయం చేస్తున్న కేంద్ర బీజేపీ పాలకుల కళ్ళు తెరిపించేందుకే మాదిగల విశ్వరూప మహా పాదయాత్ర చెప్పట్టడం జరిగిందని ఎంఎస్పీ జగిత్యాల జిల్లా కన్వీనర్ దూమాల గంగారాం అన్నారు. బుధవారం తహసిల్ చౌరస్తాలో మాదిగల విశ్వరూప మహా పాదయాత్ర పోస్టర్ను గంగారాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంగారాం మాట్లాడుతూ ఈ నెల 7 న జోగులాంబ-గద్వాల జిల్లా అలంపూర్ నుంచి మాదిగల విశ్వరూప మహా పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఎస్సి వర్గీకరణ బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలనే డిమాండ్ తో పల్లెలను, పట్టణాలను ఏకం చేస్తామన్నారు. బిజెపి పాలకుల మోసాన్ని ప్రజల ఛేదించి జాతికి విజయాన్ని అందించేలా అన్ని విధాలుగా జాగృతం చేయడమే లక్ష్యంగా మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజల్ని ఒక తాటిపైకి సామాజిక న్యాయ యుద్ధానికి సిద్ధమవుతున్నామన్నారు. మందకృష్ణ మాదిగ సారథ్యంలో సాగె ఈ మాదిగల విశ్వరూప మహా పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఏడు దశాబ్దాల అలుపెరుగని పోరాటం, కోట్లాది ప్రజల బతుకు బాధను కేంద్రములోని బిజెపి పాలకులు అర్థము చేసుకొని ఇచ్చిన మాటకు కట్టుబడి వర్గీకరణ చేసి బిజెపి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని గంగారాం కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ సురుగు శ్రీనివాస్, మాదిగ సీనియర్ నాయకులు కట్ట భూమేశ్వర్, ఈరెల్లి శంకర్, గుడిసె రవి, ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ బలవంతులు, సురేష్, జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జి బోనగిరి కిషన్, కో ఇన్చార్జ్ మీసాల సాయిలు, ఎంఎస్పి ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జ్ అరకిల సతీష్, ధర్మపురి ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ దీకొండ మహేందర్, మండలం ఇంచార్జ్ రవి, బుగ్గారం మండల ఇంచార్జ్ చిర్ర లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.