జనవరి 18న కంటివెలుగు కార్యక్రమాన్ని ఖమ్మంలో లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు

 

జిల్లాల్లో జనవరి 19వ తేదీ నుంచి కంటి వెలుగు శిబిరాలు ప్రారంభం

జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు

మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి జనవరి 16: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో సమన్వయంతో విజయవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఈ మేరకు సోమవారం మంత్రి హరీశ్రావు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వీ, కమిషనర్ శ్వేతలతో కలిసి హైదరాబాద్లోని బీఆర్బీకే భవన్ నుంచి కంటి వెలుగుకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ జనవరి 18న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లాలో లాంఛనంగా ప్రారంభిస్తారని… అనంతరం జనవరి 19న ఉదయం 9 గంటల నుంచి అన్ని జిల్లాల్లో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించాలని మంత్రి హరీశ్రావు వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా మేడ్చల్ – మల్కాజిగిరి సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ హరీశ్ పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని, దీనిని పకడ్బందీగా అమలు చేయాలని మంత్రి సూచించారు. కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు తగిన భద్రత కల్పించాలని మంత్రి పేర్కొన్నారు. జనవరి 18న ఖమ్మం లో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభిస్తారని.. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జనవరి 19న ఉదయం 9 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యులు, జడ్పీ ఛైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు వారి పరిధిలో ఉన్న కంటి శిబిరాల్లో కార్యక్రమాన్ని ప్రారంభించాలని మంత్రి హరీశ్రావు వివరించారు. ఈ విషయంలో జిల్లాల్లో కలెక్టర్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి వాట్సాప్ ద్వారా ప్రతి బృందం సకాలంలో క్యాంపులు ప్రారంభించేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, కంటి వెలుగు క్యాంపులు విజయవంతమయ్యేందుకు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, రీసోర్స్ పర్సన్లు, వీఓఏలను భాగస్వాములను చేయాలని… క్యాంపు నిర్వహణకు సంబంధించి ముందస్తు సమాచారం ప్రజలకు తెలియజేసి ప్రతి ఇంటికి ఆహ్వాన పత్రిక అందించాలని, ప్రజలు ఉదయం , మధ్యాహ్న సమయాల్లో వచ్చే విధంగా షెడ్యూల్ చేయాలని మంత్రి తెలిపారు. ప్రతి వైద్య బృందానికి క్యాంపు నిర్వహణ కోసం అవసరమైన సామాగ్రి, మందులు, కళ్ళద్దాలు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్రావు ఆదేశించారు. కంటి వెలుగు శిబిరాలకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా వారి ఆధార్ కార్డు తీసుకుని వచ్చే విధంగా ముందస్తుగానే తెలియజేసేలా అవగాహన కల్పించాలని… గ్రామాల్లో క్యాంపుల నిర్వహణ కంటే ముందుగా సంబంధిత ఆశా వర్కర్, ఏఎన్ఎమ్లు పర్యటించి షెడ్యూల్ వివరాలు ఎప్పటికప్పుడు తెలిసేలా కంటి వెలుగుపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి హరీశ్రావు ఆదేశించారు. జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, తహశీల్దార్లు, ఎంపీవోలు, మండల ప్రత్యేక అధికారి ప్రతి రోజూ వారి పరిధిలోని క్యాంపులను తనిఖీ చేయాలని, జిల్లా స్థాయిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, ఇతర ప్రోగ్రాం అధికారులు విస్తృతంగా పర్యటిస్తూ క్యాంపుల నిర్వహణను తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు నిర్వహిస్తున్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రణాళిక బద్ధంగా ప్రజలు క్యాంపులో పాల్గొని కంటి పరీక్షలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో గతంలో కంటే బృందాల సంఖ్యను రెట్టింపు చేసినందున అధికంగా ప్రజలకు కంటి వెలుగు క్యాంపులు అందుబాటులో వచ్చే విధంగా అధికారులు పనిచేయాలని, ప్రజలకు సౌకర్యార్థంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని , చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్త వహించాలని సీఎస్ శాంతికుమారి సూచించారు.


జిల్లా వ్యాప్తంగా కంటివెలుగు విజయవంతానికి అన్ని రకాల చర్యలు

కంటి వెలుగు కార్యక్రమాల నిర్వహణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి,

క్యాంపులో ప్రజలు షెడ్యూల్ ప్రకారం వచ్చేలా ప్రణాళికతో ప్రతి ఇంటికి కంటి వెలుగు ఆహ్వాన పత్రిక అందించాలి

కంటివెలుగుకు వచ్చే వారు తప్పకుండా ఆధార్ కార్డు తీసుకురావాలి

అధికారులకు సూచించిన మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ ,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. రాష్ట్ర మంత్రి హరీశ్రావుతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టారని దీనిని విజయవంతం చేయాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందన్నారు. జనవరి 18న ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారని జనవరి 19న జిల్లాలో ప్రారంభించాలని తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే సమావేశాలు నిర్వహించి అవసరమైన జాగ్రత్తలు తెలియజేశామని ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేసుకునేలా అవసరమైన ప్రణాళిక సైతం రూపొందించినందున దాని ప్రకారం పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ సమయంలో విద్యుత్తు సరఫరాలో ఏమాత్రం అంతరాయం కలగకుండా చూడాలని ఈ విషయంలో విద్యుత్ సరఫరా చేసేలా సంబంధిత అధికారులకు లేఖ రాయాలని కలెక్టర్ హరీశ్ తెలిపారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో కంటి వెలుగు క్యాంపులకు సంబంధించి షెడ్యూల్ తెలియజేస్తూ అవసరమైన భద్రత కల్పించాలని పోలీస్ శాఖ అధికారులకు కలెక్టర్ సూచించారు. అలాగే కంటి వెలుగు క్యాంపులకు వచ్చే వైద్యాధికారులు, సిబ్బందికి రాత్రిపూట ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఈ విషయంలో మునిసిపల్ కమీషనర్ ,ఆయా మండలాల ఎంపీడీవోలు, తహశీల్దార్లు ఆయా శాఖల సిబ్బందికి తగు సూచనలు చేయాలని వారికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. కంటివెలుగు క్యాంపునకు ప్రతిరోజు ఉదయం 8-45, గంటల వరకు తప్పకుండా కంటి వెలుగు బృంద సభ్యులు చేరుకోవాలని కలెక్టర్ హరీశ్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. జనవరి 17న ప్రతి క్యాంపు ప్రదేశంలో ట్రయల్ రన్ నిర్వహించి, క్యాంపులకు అందించిన సామాగ్రి పనిని పరిశీలించి సర్టిఫై చేయాలని కలెక్టర్ అధికారులతో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 480 లొకేషన్లు, 79 బృందాలు (టీమ్స్)తో 27, 51,810 మందికి తప్పకుండా కంటి పరీక్షలు నిర్వహించాలని ఈ విషయంలో వారికి ముందస్తు సమాచారం అందించడంతో పాటు గ్రామాలు, పట్టణాల్లోని ఏఎన్ఎమ్లు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు ప్రత్యేకంగా ఇళ్ళకు వెళ్ళి ఎప్పుడు క్యాంపు నిర్వహించేది తదితర వివరాలను తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా క్యాంపుల నిర్వహణ షెడ్యూల్ సంబంధిత ప్రజాప్రతినిధులకు అందజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. మేడ్చల్ – మల్కాజిగిరి పెద్ద జిల్లా అయినందున అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఉండి ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసి మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ హరీశ్ ఆకాంక్షించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీసీపీ సందీప్, జిల్లా పరిషత్ సీఈవో,దేవసహాయం , గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిణి పద్మజారాణి, జిల్లా పంచాయతి అధికారి రమణమూర్తి , మున్సిపల్ కమిషనర్లు , వైద్యాధికారులు, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking