తూప్రాన్, జనవరి, 13. తూప్రాన్ వికాస్ హైస్కూలులో గురువారం ఉదయం ముందస్తుగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. చిన్నారులు రంగురంగుల దుస్తులతో ప్రత్యేక అలంకరణలతో ముస్తాబై రుచికరమైన సంక్రాంతి స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి రుచికరమైన తినుబండారాలు ఏర్పాటు చేసి విక్రయించారు. విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా వంటకాలు సిద్ధం చేసి గుమగుమ వాసనలు గుప్పించారు. ఇందులో ఫస్ట్ క్లాస్ నైనిక సంక్రాంతి స్పెషాలిటీ చకోడీలు తయారు చేసి ఒక రోజు ముందే పండుగ వాతావరణం సృష్టించి ప్రత్యేకంగా నిలిచింది.

మిగితా విద్యార్థులు చికెన్ బిర్యానీ, చపాతీ, పులిహోర, గులాం జామ్, లడ్డులు, ప్యాలాల తో పలావు చేసి సుశీల, గంగా జమున స్వీట్, ఇలా అనేకానేక రకాలైన వంటకాలు తెచ్చి ఎవరికి వారు స్టాల్స్ ఏర్పాటు చేసి బోజనప్రియులను ఆకర్షించారు. దీనితో పాఠశాల ఆవరణ పండుగ వాతావరణం నెలకొంది. ఏదైమైనప్పటికి తూప్రాన్ వికాస్ హైస్కూల్ యాజమాన్యం సంక్రాంతి పండుగ ముందు ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు తో విద్యార్థులు ఆద్యంతం ఈ క్రొంగొత్త పండుగ ను విభిన్నంగా ఎంజాయ్ చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి వీక్షకులను అలరించారు. ఈ సందర్భంగా వికాస్ హైస్కూల్ కరస్పాండెంట్ ఎన్. శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్ తో ఇటు విద్యార్థులు, అటు వారి తల్లిదండ్రులు భాగస్వామ్యం అయి ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. ఇలా రుచికరమైన వంటలు ఇంటి వద్ద తయారు చేసి పంపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్. సరిత, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.