విజయవాడ, జనవరి 12 వైసీపీని ప్రతిపక్షాల కన్నా ఇంటిపోరే ఎక్కువగా ఇరుకున పెడుతోంది. గడపగడపకు మన ప్రభుత్వం అని జగన్ తీసుకొచ్చిన ఈ కార్యక్రమం ఆపార్టేకే ఎక్కువ నష్టం కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రజల మనోభావాలను తెలుసుకోవాలనుకున్న జగన్‌కి సొంత పార్టీ నేతల తీరే తలనొప్పిగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. సమస్యలపై ఆయా నేతలతో కలిసి చర్చించిన ఫలితం లేకుండా పోతోంది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరోసారి తన మాటలతో హాట్ టాపిక్‌గా మారారు. పెద్దరికంతో రాజకీయాలు చేసే రోజులు పోయాయని ఇప్పుడు రౌడీలను వెంటేసుకొని సొంత ఇమేజ్ కోసం ప్రయత్నించే వారే రాజకీయాల్లో రాణిస్తారని వ్యాఖ్యలు చేశారు. ఇది పెద్దగా ఆసక్తి కలిగించకపోయినా ఆయన మాట్లాడిన మరికొన్ని మాటలు విపక్షాలకు అవకాశంగా మారాయి. జగన్ ప్రభుత్వం రాజకీయకక్షతో అక్రమ కేసులు బనాయిస్తోందని విపక్షాలు ఆరోపిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఆ మాటలు నిజమేనన్నట్లు మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ మూడున్నరేళ్లల్లో ఏనాడు అనవసరంగా ఏ విపక్ష నేతపై రాజకీయకక్ష సాధింపుగా కేసులు పెట్టలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. తన తండ్రి టిడిపి ఎంపీ కేశినేని నానితో భేటీ కావడంపైనా స్పందించారు వసంత కృష్ణ ప్రసాద్. 55ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం కావడంతో వ్యక్తిగతంగానే ఈ భేటీ జరిగిందని చెబుతూ నాని కూతురి పెళ్లికి కొన్ని కారణాల వల్ల నాన్నగారు హాజరుకాలేకపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలా ప్రతిరోజూ ఏదో ఒక వ్యాఖ్యలతో ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కుతూ జగన్ కి తలనొప్పిగా మారారు. అయితే వైసీపీని వీడి టిడిపిలో చేరేందుకే వసంత ఈ వ్యాఖ్యలు చేస్తున్నారన్న వార్తలపై కూడా మొన్నా మధ్య జగన్‌తో భేటీ అనంతరం క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లో ఉన్నంతవరకు వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. జగన్ తో భేటీ అనంతరం కూడా వసంతలో ఏ మార్పు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వ్యవహరం చర్చనీయాశంగా మారింది. మైలవరం నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్‌తో వసంతకు ఉన్న విభేదాలు బహిర్గతంకావటంతో వివాదం తెర విూదకు వచ్చింది. ఈ వివాదంపై పార్టీ అధిష్ఠానం ప్రత్యేకంగా శ్రద్ద చూపింది. వసంత కృష్ణ ప్రసాద్, జోగి రమేష్‌తో విడివిడిగా ప్రభుత్వ పరిశీలకుడు సజ్జల సమావేశం అయ్యారు. ఇరువురు నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. అయినా ఈ వివాదం కొలిక్కిరాలేదు.మైలవరంలో జోగి రమేష్, వసంత కృష్ణ ప్రసాద్ మధ్య వివాదం కొనసాగుతుండగానే… వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు మరో చిచ్చు రేపారు. దీంతో వసంత కృష్ణ ప్రసాద్ మరింత ఇరకాటంలోకి వెళ్ళారు. కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఆ వ్యాఖ్యలు తన తండ్రి వ్యక్తిగతమని అందులో తనకు ఎటువంటి సంబంధం లేదని వసంత క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా వసంతను టార్గెట్‌గా చేసి పార్టీలో వివాదం చెలరేగింది. కమ్మ సామాజిక వర్గానికి వైసీపీ ప్రభుత్వంలో ప్రాధాన్యత లేదని తండ్రి వసంత నాగేశ్వరరావు చేసిన కామెంట్స్ ఎమ్మెల్యే వసంత మెడకు చుట్టుకుంది. ఈ వ్యవహరంలో కూడా మంత్రి జోగి రమేష్ లేనిపోని విషయాలు ప్రచారం చేశారని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. సోషల్ విూడియా వేదికగా జోగి రమేష్ వర్గం తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిందని చెబుతున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళిపోతున్నారని, ఎన్నికల నాటికి టీడీపీలో చేరతారని కూడా ప్రచారం చేసిందని టాక్. అందుకే వసంత కృష్ణ ప్రసాద్‌కు పార్టీలో ప్రాధాన్యత తగ్గించారనే ప్రచారం కూడా జరిగింది. మైలవరం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను స్థానిక గ్రూపు రాజకీయాలను క్లియర్ చేసి, అందరిని ఒకే తాటిపైకి తీసుకువచ్చేందుకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర స్థాయి పరిశీలకులు, మర్రి రాజశేఖర్ వంటి నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కూడా వసంత కృష్ణ ప్రసాద్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత… జోగి రమేష్ తన నియోజకవర్గంలో చేతులు పెట్టి గందరగోళ పరచడమేంటని నిలదీశారు. జోగి వైఖరి వలన నియోజకవర్గంలో పార్టీలో విభేదాలు వచ్చాయన్నారు.ఎమ్మెల్యేను కాదని మరో వ్యక్తి రాజకీయాలు చేయటంపై పార్టీ పెద్దలు కూడా సరైన రీతిలో స్పందించలేనే అభిప్రాయాన్ని వసంత వ్యక్తం చేశారు. పార్టీ నేతలు వసంత కృష్ణ ప్రసాద్‌ను సముదాయించేందుకు విషయాలను పార్టీ అగ్రనాయకత్వం వద్దకు తీసుకువెళ్ళి అవసరమైతే మరోసారి జగన్‌తో భేటీకి ఏర్పాటు చేస్తామని హావిూ ఇచ్చారు. నెల్లూరు జిల్లా రెబల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి కూడా అదే తీరుని కనబరుస్తున్నారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని ఆయన నివాసంలో కలవడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వెంకయ్య ఆహ్వానం మేరకు కోటం రెడ్డి వెళ్లారా లేదా అన్నదానిపై చర్చనడుస్తోంది. ఈ భేటీలో రాజకీయ అంశాలు చర్చకు రాలేదని కోటం వర్గీయులు చెబుతున్నప్పటికీ కారణం ఏదో ఉందన్న టాక్ వినిపిస్తోంది. వెంకయ్య నెల్లూరు జిల్లా వ్యక్తి కావడంతో పాటు సీనియర్ పొలిటికల్ లీడర్ గా ఉన్నారు కాబట్టి మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగిందన్న వార్తలు వినిపిస్తున్నా రానున్న ఎన్నికల టైమ్ ని దృష్టిలో పెట్టుకొని భిన్న కథనాలు హడావుడి చేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీకి చెందిన ఆనం రామనారాయణ తిరుగుబాటు ఎగరేస్తే ఇప్పుడు కోటం రెడ్డి భేటీలతో జిల్లా రాజకీయాల్లో కలవరం రేపుతున్నారు. ఆనం వ్యాఖ్యలతో మండిపడ్డ అధినేత జిల్లా ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. ఇప్పుడు వసంత వ్యాఖ్యలతో ఆయనకెలాంటి ఊస్టింగ్ వస్తోందన్న టాక్ మొదలైంది. అలాగే కోటం రెడ్డి కూడా పార్టీ షాకిస్తుందా అన్నది ఆసక్తిని రేపుతోంది