అంతర్జాతీయ స్థాయిలో తెలుగు విశ్వవిద్యాలయం పనిచేస్తుంది – మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిసెంబర్ 2:
తెలుగు విశ్వవిద్యాలయం బాచుపల్లి ప్రాంగణంలోని వంద ఎకరాల విస్తీర్ణంలో గల సువిశాల ప్రాంగణంలో 39వ వ్యవస్థాపన దినోత్సవం సోమవారం వైభవోపేతంగా జరిగింది. తెలుగు భాష, సాహిత్యం, లలితకళలు. సాంస్కృతిక రంగాల అభ్యున్నతికి కృషి చేస్తున్న తెలుగు విశ్వవిద్యాలయం ప్రతియేటా వ్యవస్థాపన దినోత్సవ సందర్భంగా ఆయా రంగాలకు విశేష సేవలందిస్తున్న ప్రముఖునికి విశ్వవిద్యాలయ ప్రతిష్ఠాత్మకమైన విశిష్ఠ పురస్కారాన్ని అందజేస్తుంది. సాంస్కృతిక రంగానికి ఎనలేని సేవలనందిస్తున్న శాంతా బయోటెక్నిక్స్ వ్యవస్థాపకులు పద్మభూషణ్ డా.కె.ఐ.వరప్రసాద రెడ్డికి 2023 సంవత్సరానికి గాను లక్ష రూపాయిల నగదు, ప్రశంసాపత్రంతో విశిష్ఠ పురస్కారాన్ని అందజేశారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఐ.టి., వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖామాత్యుల, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఇంఛార్జ్ మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వర్సిటీ విశిష్ట పురస్కారాన్ని వరప్రసాద రెడ్డిగారికి ప్రదానం చేసి మాట్లాడుతూ దేశ విదేశాలలో తెలుగుభాష, సాహిత్యం, లలితకళల ఔన్నత్యాన్ని చాటుతున్న తెలుగు విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తుందని అభినందించారు. ఐ.టి., ఫార్మా, సేవారంగాలలో ఉపాధి ఉన్నప్పటికినీ లలితకళా రంగాలలో కూడా ఉపాధిని పొందే విధంగా తెలుగు విశ్వవిద్యాలయం గొప్ప నైపుణ్య శిక్షణా కేంద్రంగా నిలిచినందుకు సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ నుండి విశ్వవిద్యాలయానికి అన్నివిధాలుగా సాంకేతిక పరమైన సహకారాన్ని అందిస్తుందనీ, తక్షణమే వర్సిటీకి అవసరమైన కంప్యూటర్లను, డిజిటల్ బోర్డులను, సంబంధిత సాంకేతిక పరికరాలను సమకూర్చుతామని హామి ఇచ్చారు. విశ్వవిద్యాలయం ప్రదానం చేస్తున్న విశిష్ట పురస్కారాన్ని పొందిన వరప్రసాద రెడ్డి వ్యక్తి కాదు వైద్య రంగంలో అసమాన కీర్తిని పొందిన శక్తిగా నిలిచారని, పురస్కారానికే ప్రత్యేక గౌరవాన్ని అపాదించారని ప్రశంసించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుల ఆచార్య వెలుదండ నిత్యానందరావు మాట్లాడుతూ బాచుపల్లిలో ఏర్పడిన తెలుగు విశ్వవిద్యాలయ నూతన ప్రాంగణానికై పూర్వ ఉపాధ్యక్షులు, రిజిస్ట్రార్లు చేసిన కృషిని గుర్తుచేస్తూ వారందించిన సేవల ప్రతిఫలమే ఈనాటి ఈ సువిశాల విశ్వవిద్యాలయ ప్రాంగణమని వారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు విశ్వ విద్యాలయం కేవలం రాష్ట్ర విశ్వవిద్యాలయమే కాదని, అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా పనిచేస్తూ అమెరికా, మలేషియా, మారషస్ మొదలగు దేశాలలో తమ అనుబంధ సంస్థలు తెలుగు భాషా సాహిత్య వికాసానికై అవిరళ కృషి చేస్తున్నదని గుర్తుచేశారు. విశ్వవిద్యాలయాన్ని మరింత ప్రగతిపథంలో నడిపించడానికి ప్రభుత్వ సహకారంతో భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకుంటుందని వివరించారు.
పురస్కార గ్రహీత పద్మభూషణ్ డా. కె.ఐ. వరప్రసాద రెడ్డి తన ప్రతిస్పందనలో మాట్లాడుతూ మన సంస్కృతే తెలుగువారికి బలం, అస్తిత్వం అని వాటిని సమాజంలో కాపాడుకోవడానికి, అవి మరింత పరిఢవిల్లడానికి తెలుగు విశ్వవిద్యాలయం అవసరమని అందుకు ప్రభుత్వ సహకారం వాంఛనీయమని వరప్రసాదరెడ్డిగారు పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రాథమిక పాఠశాలల్లోను, విశ్వవిద్యాలయాల్లోను సంస్కృతి. భాష పట్ల అవగాహన కల్పించాలని అప్పుడే మంచి పౌర సమాజం నెలకొంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
వృత్తి పరంగా అందించిన వైద్య సేవల కన్నా ప్రవృత్తి పరంగా తెలుగు భాషా సాహిత్యానికి చేస్తున్న సేవలే నా జీవితానికి సంతృప్తి నిస్తాయని తెలియజేస్తూ, విశ్వవిద్యాలయం అందించిన విశిష్ట పురస్కార నగదుతో పాటు మరో కోటి రూపాయలను వర్సిటీకి అవసరమయ్యే మౌలిక సదుపాయాల నిర్మాణానికై విరాళంగా చెక్కును మంత్రివర్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సమక్షంలో విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య నిత్యానందరావుకు అందజేశారు.
ఆత్మీయ అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఉన్నతవిద్యామండలి అధ్యక్షులు ఆచార్య వి. బాలక్రిష్ణారెడ్డిగారు ప్రసంగించారు
కార్యక్రమానికి తొలుత విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు అతిథులకు స్వాగతం పలుకుతూ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న కోర్సుల వివరాలను, తెలుగు భాష, సాహిత్యాల ఔన్నత్యాన్ని, వాటి ప్రాభవాన్ని పెంచేందుకు విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని వివరించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపాలిటీ మేయర్ శ్రీమతి కొలను నీలా గోపాల్ రెడ్డి, మేడ్చల్ – మల్కాజ్ గిరి కలెక్టర్, శ్రీ గౌతంపొట్రు ఐఏఎస్, అడిషనల్ కలెక్టర్ రాధిక ఐఏఎస్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్, ఎం.డి. సాబేర్ అలీ లతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, విశ్వవిద్యాలయ బోధనా, బోధనేతర మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు విశ్వవిద్యాలయం ఆత్మీయ సత్కారంతో పాటు చిత్ర, శిల్పకళల విద్యార్థులు చిత్రించిన చిత్రపటాలను అందించారు. విస్తరణ సేవా విభాగం ఇంఛార్జ్ సహాయ సంచాలకుడు రింగురామమూర్తి పురస్కార ప్రదాన కార్యక్రమానికి సమన్వయ కర్తగా వ్యవహరించారు.
సాంస్కృతిక పదర్శనలు :
తెలుగు విశ్వవిద్యాలయం శిల్పం-చిత్రలేఖన విభాగానికి చెందిన బోధనా సిబ్బంది డా.వెంకటేశం, మహేష్, గ్లోరీ పాల్‌ల ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులు చిత్ర శిల్ప కళా నైపుణ్యంతో విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని అంగరంగ వైభవంగా, అందంగా అలంకరించి తమ కుంచెతో జాలువారిన చిత్రకళా ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
పురస్కార ప్రదానానికి ముందుగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో రంగస్థల కళల శాఖాధిపతి డా. బి.హెచ్.పద్మప్రియ పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించిన మత్తువదలరా! నాటకం సామాజిక రుగ్మతలను ఎత్తిచూపుతూ తద్వారా జరిగే పరిణామలను విశదీకరిస్తూ సందేశాత్మక ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది.
నృత్యశాఖాధిపతి డా. వనజా ఉదయ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి, పేరిణి, ఆంధ్రనాట్య కళారూపాల ప్రద్శరన సభికులను ఎంతగానో అలరించింది.
జానపద కళలశాఖాధిపతి డా. లింగయ్య తన జానపద విద్యార్థులచే డప్పు నృత్యాన్ని ప్రదర్శించారు.
విశ్వవిద్యాలయం విద్యార్థులైన జాతీయ స్థాయి ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార గ్రహీతలైన పేరిణి రాజ్ కుమార్, ఒగ్గు రవి, అందె భాస్కర్ తమ బృందాలతో ప్రదర్శించిన కళారూపాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ప్రముఖ సంగీత కళాకారిణి శ్రీమతి శ్వేతా ప్రసాద్ తన గానామృతంతో సభికులను అలరించింది.