– సర్వే వివరాల ఆధారంగానే చివరి గడపకూ లబ్ధి చేకూర్చేలా ఎలాంటి పథకాలు రూపొందించాలో ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది.
-రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిషోర్
ఖైరతాబాద్ ప్రజాబలం ప్రతినిధి:బంజారా హిల్స్ 01, నవంబర్ 2024: నూరు శాతం ఖచ్చితత్వంతో
సామాజిక, ఆర్థిక,విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే సమగ్రంగా చేపట్టాలని
రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దాన కిషోర్ సూచించారు.
బంజారా హిల్స్ లోని గౌరీ శంకర్ కమ్యూనిటీ హాలులో ఖైరతాబాద్ జోన్ లో చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై
శుక్రవారం సూపర్ వైజర్ లు, ఎన్యూమరేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ శిక్షణ కార్యక్రమంకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
సర్వే ఉద్దేశ్యం, ప్రభుత్వ మార్గదర్శకాలను ముఖ్య కార్యదర్శి వివరించారు.
నవంబరు 6 నుంచి ప్రారంభ మయ్యే సర్వేలో
వివిధవర్గాల ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులనుఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. గ్రేటర్ పరిధిలో సర్వేను చేపట్టేందుకు 21 వేల మంది ఎన్యూమరేటర్లను వినియోగించుకుంటున్నామన్నారు. ఆర్పీ లను కూడా సర్వే లో భాగం చేశామన్నారు.
సర్వేను పకడ్బందీగా చేపట్టేందుకు ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక్కో సూపర్ వైజర్ ను నియమించామని చెప్పారు.
ఏమైనా సందేహాలు ఉంటే సూపర్ వైజర్ లను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు.
సమగ్ర సర్వే ద్వారా ప్రభుత్వ పథకాలు చిట్టచివరి పేదవారికి చేరేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.
సర్వే వివరాలు నిక్కచ్చిగా నమోదు చేసేందుకు వీలుగా….. క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టే ముందు ప్రతి ఎన్యూమరేటర్ జిరాక్స్ సర్వే పత్రాలతో ప్రాక్టీసు చేసేలా చూడాలని, అప్పుడే వారికి పూర్తి అవగాహన వస్తుందని మున్సిపల్ అధికారులకు ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి సూచించారు .
కార్యక్రమంలో అదనపు కమిషనర్ ( లేక్స్) కె.శివకుమార్ నాయుడు, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, తదితరులు పాల్గొన్నారు.