రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి వ్యవసాయ రంగం కీలకం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 18 : రాష్ట్ర ఆర్థిక వృద్ధికి వ్యవసాయ రంగం కీలకమని,రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.రైతు రుణమాఫీ పథకం అమలులో భాగంగా గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ అపర్ణ రెడ్డి,లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ లతో కలిసి బ్యాంకు నోడల్ అధికారులు, కంట్రోలర్లు, మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తుందని,ఈ క్రమంలో జిల్లాలోని అర్హత గల రైతులకు లబ్ది చేకూరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.భూమి కలిగి రుణం పొందిన ప్రతి రైతు కుటుంబానికి రుణమాఫీ వర్తిస్తుందని,స్వల్పకాలిక పంట రుణాలు పొందవచ్చని తెలిపారు.షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు,ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు,జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల శాఖల నుండి రుణం పొందిన రైతులకు పథకం వర్తిస్తుందని,డిసెంబర్ 12, 2018 అనంతరం మంజూరైన, రెన్యువల్ అయిన రుణాలకు, డిసెంబర్ 9,2023 నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు వర్తిస్తుందని తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకం అమలు కోసం పోర్టల్ నిర్వహించడం జరుగుతుందని, రైతు కుటుంబాలకు సంబంధించిన రుణ ఖాతా వివరాలు పరిశీలించి రుణమాఫీ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.ప్రతి బ్యాంకు లో ఒక అధికారిని నోడల్ అధికారిగా నియమించాలని,రుణమాఫీ వివరాలను నిర్ణీత నమూనాలు పొందుపరిచి డిజిటల్ సంతకం చేసి సమర్పించాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో రైతుల వివరాలను పరిశీలించాలని,2 లక్షల రూపాయలకు మించి రుణం ఉన్న రైతులు రుణమాఫీ పొందేందుకు 2 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని ముందుగా బ్యాంకుకు చెల్లించవలసి ఉంటుందని తెలిపారు.స్వయం సహాయక సంఘాలు,జె.ఎల్.జి. లు,ఆర్.ఎం.జి.లు,ఎల్.ఇ.సి. ఎస్.లు,పునర్వ్యవస్థీకరించిన రుణాలు,కంపెనీలు, పరం వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలకు వర్తించదని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుందని, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ మినహాయింపులకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న వివరాల మేరకు ఆచరణాత్మకంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. బ్యాంకు అధికారులు నిర్ణీత నమూనాలో రైతుల అర్హత, సంబంధిత వివరాలను పరిశీలించి బ్యాంకు నోడల్ అధికారుల డిజిటల్ సంతకంతో వివరాలను సమర్పించాలని తెలిపారు. అర్హత గల రైతులు మాత్రమే రుణమాఫీ పొందాలని, అనర్హులు మోసపూరితంగా రుణమాఫీ పొందినట్లయితే చట్ట ప్రకారం రికవరీ చేయడం జరుగుతుందని తెలిపారు. పథకం గురించి రైతుల సందేహాల నివృత్తి, ఇబ్బందులను పరిష్కరించడానికి మండల స్థాయిలో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని,వీటి ద్వారా రైతులు తమకు కావలసిన వివరాలు పొందవచ్చని తెలిపారు.  ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అందించిన రుణమాఫీని అర్హత గల రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ఆ దిశగా అధికారులు సమన్వయంతో పనిచేసి అసలైన లబ్ధిదారులకు పథకం ఫలాలు అందేలా కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking