– ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సామాజికవేత్త వెంకట్
– అగ్రిప్రమాద బాధితులకు రూ.5 వేల చొప్పున అందజేత
హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి జులై 18
ప్రముఖ సామాజికవేత్త, మల్టీ నేషనల్ కంపెనీ ‘జెన్‌ప్యాక్ట్’ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ నెల 15న జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన చిరు వ్యాపారులకు ప్రకటించిన సాయాన్ని అందజేశారు. వివరాల్లోకెళితే..హుజూరాబాద్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా సమీపాన చిరు వ్యాపారులకు చెందిన ఫ్రూట్స్, మెకానిక్ షాపులు, కొబ్బరి బొండాల దుకాణం, చెప్పుల షాపు వంటి వివిధ రకాల షెడ్లు సోమవారం అర్ధరాత్రి అగ్నికి ఆహుతి అయిన విషయం విదితమే. విషయం తెలిసిన మరుక్షణమే వెంకట్ బాధిత కుటుంబాలకు రూ.5 వేలు చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. గురువారం హుజురాబాద్‌కు హైదరాబాద్ నుంచి వచ్చి బాధితులను స్వయంగా కలుసుకున్న వెంకట్.. నగదు సహాయాన్ని తన చేతుల మీదుగా అందించారు.
పునరావాస చర్యలు చేపట్టాలని రాష్ట్రసర్కారుకు విజ్ఞప్తి
అగ్ని ప్రమాద ఘటనలో నష్టపోయిన బాధితులందరూ తమకు దేవుడిలా ఆర్థిక రూపేనా ఆదుకున్న సబ్బని వెంకట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం 31 మంది బాధితులు ఉండగా… ఒక్కొక్కరికి రూ.5 వేలు చొప్పున రూ.లక్షా 55 వేలను వెంకట్ వ్యక్తిగతంగా అందించి పట్టణ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన ప్రాంతంలో బాధితులతో పాటు పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి వెంకట్ మాట్లాడారు. ఇలాంటి అనుకోని ఘటనలు జరిగి పేదలు రోడ్డున పడిన సందర్భాలు ఎదురైనప్పుడు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి చేతనైనంత ఆర్థిక సహాయం అందించడం ద్వారా మానవతను చాటుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వం నష్టపోయిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించాలన్నారు. ఎప్పటి మాదిరిగా బాధితులు తమ వ్యాపారం కొనసాగించుకునేందుకు పునారావాస చర్యలు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా సబ్బని వెంకట్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
చిరువ్యాపారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి
పొద్దంతా కష్టపడి పని చేసుకుని బతికే చిరువ్యాపారుల సమస్యలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని సబ్బని వెంకట్ కోరారు. తాను ఏదో ఆశించి ప్రజలకు సాయం చేయడం లేదని చెప్పారు. తాను ఆర్థిక సాయం ప్రకటించిన తర్వాత స్థానిక ఏసీపీ బాధితులకు సాయం చేశారని తెలిసిందని, స్థానిక ఎమ్మెల్యే సైతం సాయం చేయబోతున్నారని తెలుసుకుని గర్విస్తున్నానని పేర్కొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రజా సమస్యలపైన ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని వెంకట్ సూచించారు.
హుజూరాబాద్ అభివృద్ధి కోసం కొట్లాడే వారికి నా మద్దతు: వెంకట్
హుజూరాబాద్ బై పాస్ పూర్తయితే నియోజకవర్గకేంద్రమైన హుజూరాబాద్‌లో వ్యాపారాలన్నీ అడుగంటిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ అభివృద్ధిపైన అధికారంలో ఉన్న వారైనా, అధికారంలో లేని వారైనా పోరాడాలన్నారు. హుజూరాబాద్‌కు సంబంధం లేని బూడిద పంచాయితీని మీద వేసుకున్నారు తప్పా ప్రజల బతుకుల బాగు కోసం పని చేయడం లేదని విమర్శించారు. హుజూరాబాద్‌లో ఎలాంటి అభివృద్ధి లేదని, అభివృద్ధిపైన దృష్టి సారించాలన్నారు. అలా డెవలప్‌మెంట్ కోసం, మెడికల్ కాలేజీ లేదా పరిశ్రమల కోసం కొట్లాడే వారితో కలిసి..తాను ఉద్యోగాన్ని వదులుకుని వచ్చి టెంట్‌లో కూర్చొని నిరాహార దీక్ష చేస్తానని సబ్బని వెంకట్ వెల్లడించారు.
సమాజంలో వెంకట్ లాంటి వ్యక్తులుండటం గర్వకారణం
ఘటన జరిగిన విషయం తెలియగానే వెనుక ముందు ఆలోచించకుండా రూ.5 వేలు చొప్పున ఆర్థిక సహాయం ప్రతి బాధిత కుటుంబానికి అందిస్తానని వెంకట్ ప్రకటించారని సూపర్ బజార్ కౌన్సిలర్ కేసిరెడ్డి లావణ్య నర్సింహారెడ్డి తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం వెంకట్ సాయం అందించడం ఎంతైనా అభినందనీయమని కౌన్సిలర్ సంతోషం వ్యక్తం చేశారు. సమాజంలో వెంకట్ లాంటి స్పందించే మనసు ఉన్న వ్యక్తులు ఉండడం మనందరికీ గర్వకారణమని ఆమె హర్షం వ్యక్తం చేస్తూ బాధితుల తరఫున సబ్బనికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధితులకు సహాయం అందించడంలో పార్టీలకు అతితంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కౌన్సిలర్ లావణ్య పిలుపునిచ్చారు.
అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటో?
అగ్ని ప్రమాదానికి సంబంధించి అసలు విషయాలు ఇంతవరకు బహిర్గతం కాకపోవడం పట్టణంలో చర్చనీయాంశంగా తయారయింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని వినపడుతున్న వాదనలను ఏ ఒక్కరు నమ్మడం లేదు. కచ్చితంగా ఈ అగ్ని ప్రమాద ఘటన వెనుక కుట్రకోణం దాగి ఉందని మెజార్టీ ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే నిజమైతే ఈ కుట్రను ఏం ఆశించి ఎవరు అమలు చేసి ఉంటారో ఎవరికి అర్థం కావడం లేదు. హుజురాబాద్ పోలీసులకు ఈ అగ్ని ప్రమాద ఘటన ఒక చాలెంజ్ గా తయారైంది. నిజా నిజాలు ఏమిటో తెలిసే వరకు కొత్త కొత్త వాదనలు తెరమీదకు వచ్చే అవకాశం ఉంది.
