లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయింపు

 

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 21 (ప్రజాబలం) ఖమ్మం నూతన మద్యం పాలసీ 2023-2025 సంవత్స రాల కాలపరిమితితో కూడిన లైసెన్సుల జారీ కోసం సోమవారం స్థానిక సీక్వెల్ రిసార్ట్స్ లో లాటరీ పద్దతిలో మద్యం దుకాణాల కేటాయింపు నకు లక్కీ డ్రా నిర్వహించారు పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ నగర పాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ లతో కలిసి కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా సాఫీగా ఈ ప్రక్రియ పూర్తి చేశారు నూతన ఎక్సయిజ్ పాలసీ నియమ నిబంధ నలను అనుసరిస్తూ ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 122 మద్యం షాపులకు గాను మొత్తం 7207 దరఖాస్తులు దాఖలయ్యాయి. అత్యధికంగా 36వ నెంబర్ మద్యం దుకాణానికి 149 దరఖాస్తులు రాగా, 71, 94వ నెంబర్ మద్యం షాపుల లైసెన్స్ కోసం 32 చొప్పున అత్యల్పoగా దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో షాపు వారీగా దాఖలైన దరఖాస్తులకు సంబంధించిన వారిని వేదిక పైకి ఆహ్వానిస్తూ వారి సమక్షంలో లక్కీ డ్రా తీస్తూ మద్యం దుకాణాల కేటాయింపును ఖరారు చేశారు. లక్కీ డ్రా కోసం వినియోగించిన టోకెన్ లను అందరికీ చూపిస్తూ, పారదర్శకంగా డ్రా నిర్వహించారు. ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా లక్కీ డ్రా ప్రక్రియను ఆద్యంతం ఫొటో వీడియో చిత్రీకరణ జరిపించారు పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు హాజరు కావడంతో టోకెన్ కలిగి ఉన్న వారినే లోనికి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా రిసార్ట్ తో పాటు పరిసర ప్రాంతాల్లోనూ కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్కీ డ్రాలో అదృష్టం వరించి వైన్ షాపులు కేటాయించబడిన వారు నిబంధనలను అనుసరిస్తూ, లైసెన్స్ ఫీజు రూపేణా నిర్ణీత రుసుము చెల్లించేందుకు వీలుగా సీక్వెల్ రిసార్ట్ వద్దనే అవసరమైన ఏర్పాట్లు కల్పించారు. జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జి. నాగేంద్ర రెడ్డి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెం డెంట్ వేణుగోపాల్ రెడ్డి ఎక్సైజ్ సిఐ లు ఇతర అధికారుల పర్యవేక్షణలో మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డ్రా ప్రశాంతంగా ముగిసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking