తిరగబడదాం తరిమికొడదాం నినాదంతో ప్రజల్లోకి
బీఆర్ఎస్ ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలను ప్రజలకు వివరించే ప్రయత్నం
సెప్టెంబర్ 15వరకు కొనసాగనున్న కార్యక్రమం
ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇందులో భాగస్వామ్యం అవ్వాలి
విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ నగర అధ్యక్షులు మహ్మద్ జావేద్
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 21 (ప్రజాబలం)ఖమ్మం తిరగబడదాం తరిమికొడదాం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లి బీఆర్ఎస్ పాలకుల తీరును ఎండగడదాం అని ఇందులో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భాగస్వామ్యం అవ్వాలని డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్ పేర్కొన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గడిచిన తొమ్మిదిన్నర ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నట్లు తెలిపారు. ధరల నియంత్రణలో విఫలం, రైతంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఇంకా అనేక రకాల హామీల అమలులో ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడం లాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేట్ తరహాలో ఉన్నాయని మంత్రి హారీష్ రావు చెప్తాడని… కానీ ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు గానీ వారి కుటుంబ సభ్యులకు గానీ … అదేవిధంగా హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు కుటుంబీకులకు గానీ ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే దేశ, విదేశాలకు వైద్యం కోసం వెళ్లడంతో పాటు తెలంగాణలోకి కార్పొరేట్ ఆసుపత్రులలో ఎందుకు వైద్యం తీసుకుంటున్నారని ప్రశ్నించారు. కార్పొరేట్ తరహాలో వైద్యసేవలు అందిస్తున్నప్పుడు వీరు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందవచ్చు కాదా…? అని దుయ్యబట్టారు. బడుగు, బలహీన వర్గాల వారిని మోసం చేసిన కేసీఆర్ ను మూడోసారి గద్దెను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కించరాదని ఇందుకు మనమందరం కృషిచేయాలని పేర్కొన్నారు. ఈనెల 21 నుంచి వచ్చేనెల 15వరకు జరిగే ఈ ” తిరగబడదాం తరిమికొడదాం ” అనే కార్యక్రమాన్ని బూత్ లెవల్ నుంచి జిల్లా స్థాయి వరకు ఉ న్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, అభిమాని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని కోరారు.
ఈ విలేకరుల సమావేశంలో వీరితో పాటు ఖమ్మం నియోజకవర్గ పి సి సి సభ్యులు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్, జిల్లా SC సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య, నగర మైనారిటీ, సేవాదళ్ అద్యక్షులు అబ్బాస్, గౌస్ మరియు మహమూద్ తదితర నాయకులు పాల్గొన్నారు.