– బూజునూర్ లో నిర్మాణం పూర్తయి రెండేళ్లు గడుస్తున్న వైనం
– పంపిణీ జరగకపోవడంతో ఇండ్లను ఆక్రమించుకుంటున్నారు
– పట్టించుకోని స్థానిక ప్రజాప్రతినిధులు
– ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ప్రారంభం ఎప్పుడో?
– ఇండ్ల మధ్యలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం బోర్డు
ఇల్లందకుంట ప్రజాబలం ప్రతినిధి మే 22
దేవుడు కనికరించినా పూజారి వరం ఇవ్వని చందంగా ఇల్లందకుంట మండలం బూజునూర్ గ్రామంలోని “డబుల్ ” ఇండ్ల పంపిణీ వ్యవహారం మారింది. ఇండ్ల నిర్మాణం పూర్తయి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా పంపిణీకి నోచుకోకపోవడంతో ఇతరులు ఇండ్లను ఆక్రమించుకుంటున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టడం పూర్తయి ఉన్నప్పటికీ ఇండ్ల పంపిణీ అర్హులకు అందని ద్రాక్ష గానే మారింది. అర్హులైన లబ్ధిదారులకు అందాల్సిన ఇండ్లు అందడం లేదని పలువురు వాపోతున్నారు. అర్హులకు ఇవ్వకపోవడంతో గ్రామస్తులు కొందరు ఇండ్లను ఆక్రమించుకొని దర్జాగా రెండు తాళాలు వేసుకొని నివాసంగా మార్చుకోవడం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దృష్టిసారించి అర్హులకు ఇండ్లు పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. లేదంటే ఇండ్ల మధ్యలో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి.. అసాంఘిక కార్యకలాపాలకు ఇండ్లు అడ్డాగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గురించి పట్టించుకునే నాథుడే లేడా ?
బూజునూర్ గ్రామ పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం పూర్తయి రోజులు గడుస్తున్న దానిని అందుబాటులోకి తీసుకొచ్చే నాదుడే కరువయ్యాడని స్థానికులు చెబుతున్నారు. ప్రజలకు ఆరోగ్య వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత శాఖ అధికారులపై స్థానిక ప్రజా ప్రతినిధులు ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అలంకారప్రాయంగా మారిన పీహెచ్ సీ ని త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. గ్రామంలోని ఇండ్ల మధ్యలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం ఉండటం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఇండ్ల మధ్యలో బోర్డు ఉండటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
