అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ ప్రజాబలం ప్రతినిధి:బుధవారం నుండి ప్రారంభ ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఈ నెల మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు మంగళవారం సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, ఏర్పాట్ల పై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 5 వ తేదీ నుండి 25 వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలు ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు జరుగుతాయని అన్నారు. ఇంటర్ పరీక్షలకు మొత్తం 18, 880 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. 31 పరీక్షా కేంద్రాలలో, ప్రథమ సంవత్సరం 9106 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరం 9774 మంది విద్యార్థులు, మొత్తం 18, 880 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఇందుకు 23 మంది చీఫ్ సూపరెండెంట్లు, 23 మంది ఆయా శాఖల అధికారులు, ప్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్స్ లను నియమించడం జరిగిందని తెలిపారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు సమయా అనుకూలంగా రవాణా సదుపాయం అందుబాటులో ఉండేలా బస్సులు నడిపించాలని అన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా కు అంతరాయం కలగకుండా చూడాలని, నిర్ణీత సమయానికి సకాలంలో ప్రశ్నపత్రాలు కేంద్రాలకు చేరేలా చర్యలు చేపట్టాలని అన్నారు. పోస్టల్ అధికారులు ప్రశ్నా పత్రాలను జాగ్రత్తగా తరలించాలని, పరీక్షలు ప్రారంభం అయ్యే సమయానికి ముందే విద్యార్థులు తమకు కేటాయించబడిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రాల లో తీసుకువెళ్లడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్ష వ్రాసే సమయం లో అర గంట కు ఒకసారి బెల్ మోగుతుందని అన్నారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్ లను మూసి వేయించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, పోలీస్ బందోబస్తు, తదితర ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ తప్పనిసరిగా తాగునీటి వసతి, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలను నియమిస్తూ ఫస్ట్ ఎయిడ్ కిట్ తో అందుబాటులో ఉండాలని అన్నారు.కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని అన్నారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా పరీక్షలు జరిగేలా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలనీ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులు ఒత్తిడి కి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు వ్రాయాలని, విద్యార్థులకు అల్ ది బెస్ట్ తెలిపారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, ఐ ఈ ఓ గణేష్, , జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.