-సినీ పాత్రికేయులు ప్రభు విజ్ఞప్తి
తన భార్య మరణానికి ముందు విడుదల చేసిన సూసైడ్ వీడియో ఆధారంగా బాధ్యులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు జరపాలని సినీ పాత్రికేయులు ప్రభు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కూతురు స్పందనతో కలిసి మాట్లాడారు. తన భార్య దుర్గా మాధవి తల్లిదండ్రులతో ఉన్న ఆర్థిక పరమైన అంశాల నేపథ్యంలో తలెత్తిన మానసిక ఒత్తిడితో సూసైడ్ వీడియోను తీసుకొని తమ ఇంటి నుంచి కనిపించకుండా పోయిందని అన్నారు. ఈ విషయమై తాము జనవరి 2 తారీఖున పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా జనవరి 4న దుర్గం చెరువులో మృతి చెందినట్లు పోలీసు ద్వారా తెలుసుకున్నమని చెప్పారు. పోలీసుల సమన్వయ లోపంతో తన భార్య మృతదేహం సుమారు మూడు రోజులపాటు అనాధ శవంలా ఉండిపోయిందని చెప్పారు. మానసిక ఒత్తిడికి గురైన తన భార్య సూసైడ్ వీడియోలో నలుగురు పేర్లను వివరిస్తూ వెళ్ళిపోయినని చెప్పారు. అనంతరం మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న తాము మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా దుర్గం చెరువులో ఎలా ఆత్మహత్యకు పాల్పడింది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే అంశాలు ఇంకా ప్రశ్నలు గానే మిగిలిపోయాయని చెప్పారు. సంఘటన జరిగి 14 రోజులైనా ఇప్పటివరకు ఆమె ఆరోపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకోకపోవడం దుర్గం చెరువు చుట్టూ సీసీ కెమెరాలు పనిచేయడం లేదని మాదాపూర్ పోలీసులు చెప్పడం ఆశ్చర్యన్ని కలిగిస్తుందని అన్నారు. ఇప్పటికైనా పోలీసులు ఆమె సెల్ఫీ వీడియో ను మరణ వాంగ్మూలంగా భావించి సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.