బనకచర్ల పాపం కేసీఆర్‌దే

డాక్టర్‌ కోట నీలిమ.
సికింద్రాబాద్‌ ప్రజాబలం ప్రతినిధి: ఏపీ ప్రభుత్వం తలపెట్టిన బనకచర్ల – గోదావరి ప్రాజెక్ట్‌ నిర్మాణానికి పునాది వేసిన పాపం ముమ్మాటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, సనత్‌ నగర్‌ నియోజకర్గ ఇంచార్జ్‌ డాక్టర్‌ కోట నీలిమ అన్నారు. కేసీఆర్‌ అప్పటి ఏపీ ముఖ్యమంత్రితో చేతులు కలిపి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని తెలిపారు. తెలంగాణ నీటి ప్రయోజనాలను గత ప్రభుత్వం కాపాడలేదని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిందంతా చేసి అధికారం పోయాక బయటకు వచ్చి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని తెలిపారు.
కేసీఆర్‌ అప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి రాయలసీమను సస్యశ్యామలం చేసి రతనాల సీమగా మారుస్తాను అని మీడియా ముఖంగా చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఏపీలో తలపెట్టబోయే ప్రతి ప్రాజెక్ట్‌కు పెద్దన్నగా ఉంటానని కేసీఆర్‌ హామీ ఇచ్చింది మర్చిపోయారా అని బీఆర్‌ఎస్‌ నేతలను నిలదీశారు. కేసీఆర్‌ ఇచ్చిన భరోసాతోనే ఏపీ ప్రభుత్వం ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్ట్‌ కడుతుందని పేర్కొన్నారు. ఇకనైనా బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనులు మానుకోవాలని డాక్టర్‌ కోట నీలిమ సూచించారు. 3 వేల టీఎంసీల మిగులు జలాలు గోదావరిలో ఉన్నాయని కేసీఆర్‌ చెప్పడం వల్లే ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్ల చేపట్టారని కానీ.. గోదావరి బేసిన్‌లో తెలంగాణకు 968 టీఎంసీలు, ఏపీకి 518 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు.
గోదావరిపై తెలంగాణ కట్టిన ప్రాజెక్టులకు 968 టీఎంసీలు వాడుకోవడానికి ముందుగా అనుమతులు రావాలని.. తెలంగాణ ప్రాజెక్టులు కట్టి వాడుకున్నాక మిగిలిన నీళ్లు కిందకు పోతే.. వాటిని మిగులు జలాలు అంటారని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారని డాక్టర్‌ కోట నీలిమ తెలిపారు. అలా వెళ్లిన నీటిని ఏపీ ప్రభుత్వం వాడుకుంటే మాకు అభ్యంతరం లేదని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పినట్లు గుర్తు చేశారు. కానీ ఏపీ ప్రభుత్వం సమ్మక్క సాగర్‌, సీతారామ్‌ సాగర్‌తో సహా మరికొన్ని ప్రాజెక్టులకు అడ్డుపడి అనుమతులు రాకుండా చేసి.. ఇప్పుడు మిగులు జలాలు అని అంటున్నారని పేర్కొన్నారు. అసలు మిగులు జలాలు ఎక్కడున్నాయి.. నిజంగా 3000 టీఎంసీల మిగులు జలాలు ఉంటే.. అందులో 1500 టీఎంసీలు వాడుకునేలా ఏపీ ప్రభుత్వం తెలంగాణ నుంచి ఎన్‌వోసీ తీసుకోవాలన్న సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను ఆమె సమర్థించారు. కేసీఆర్‌ చేసిన ద్రోహం వల్లే తెలంగాణకు ఈ నీటి కష్టాలు వచ్చాయన్నారు.
గడిచిన పదేళ్లు కేసీఆర్‌ అబద్ధాలతో తెలంగాణ ప్రజలనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను కూడా మోసం చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బనకచర్లను అడ్డుకుంటామని వివరించారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన కేసీఆర్‌.. బనకచర్లకు అనుమతులు ఇచ్చి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు.
ఇకనైనా బీఆర్‌ఎస్‌ నేతలు అబద్ధాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. అప్పుల్లో ఉన్నా కూడా ధైర్యం కోల్పోకుండా ఓ వైపు సంక్షేమాన్ని.. మరోవైపు అభివృద్ధిని బ్యాలెన్స్‌ చేస్తూ.. రేయింబవళ్లు తెలంగాణ భవిష్యత్‌ తరాల కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి సహకరించాలని కోరారు. ప్రజలు అమాయకులు కాదని వారికి అన్నీ తెలుసని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి అడ్డుపడవద్దని బీఆర్‌ఎస్‌ నేతలకు సూచించారు డాక్టర్‌ కోట నీలిమ.

Leave A Reply

Your email address will not be published.

Breaking