ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 18:
లోకసభ ఎన్నికల సమయంలో బ్యాంకర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని బ్యాంకర్ల సమావేశంలో మల్కాజిగిరి -07 పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్లోని వి సి హాల్ లో ఎన్నికల వ్యయమానిటరింగ్ సమావేశాన్ని బ్యాంకర్లతో నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకర్లకు, బ్యాంకు ఖాతాదారులకు ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిర్దేశించారు. నగదు రవాణా సమయంలో అవసరమైన మేరకు క్యు ఆర్ కోడ్ ను తప్పని సరిగా చూపించాలని కలెక్టర్ అన్నారు. నగదు లావాదేవీలు, రవాణ చేసేటప్పుడు తగిన ఆధారాలతో జరగాలని నిర్ధేశించారు. అలాగే యాభై వేల రూపాయల కంటే ఎక్కువ ఉన్నట్లయితే అందుకు తగిన రుజువులు, ధ్రువీకరణ పత్రం జతచేయాల్సిందిగా సూచించారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలు ఉంటే రోజువారీగా నివేదిక సంబంధిత ఎల్డీఎమ్లకు అందచేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బ్యాంకర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి హరిప్రియ, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసులు, జిల్లాలోని బ్యాంకర్లు, నోడల్ అధికారులు, ఎన్నికల అధికారులు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.