మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య
మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి మే 1:
సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళలు పని చేసే స్థలంలో మహిళలపై లైంగిక వేధింపులు నివారణ, నిషేదం, పరిష్కార చట్టం –2013 (పోష్ చట్టం) పై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ మహిళలు వారు పని చేసే ప్రదేశంలో వారిని గౌరవించడంతో పాటు స్వేచ్ఛ, మర్యాదలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా వారి హక్కులను పరిరక్షించడానికి కృషి చేయాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు. ఈ విషయంలో వారి హక్కులకు భంగం వాటిల్లకుండా పరిరక్షించడానికి జిల్లాలోని ప్రతి కార్యాలయంలో, మహిళలు పని చేసే ప్రదేశంలో తప్పకుండా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ను తప్పకుండా ఏర్పాటు చేయాల్సిందిగా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో మహిళలకు సంబంధించి గౌరవం ఇవ్వాలని వారి హక్కులకు భంగం వాటిల్లకుండా చూడాలన్నారు. దీంతో పాటు అన్ని కార్యాలయాల్లో ఐసీఎస్ ఏర్పాటు చేసి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి (డీడబ్ల్యువో) అక్కేశ్వరరావు, ఆయా శాఖల జిల్లా అధికారులు, మహిళా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.