నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య
మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి మే 1:
దేశభవిష్యత్తు యువతరంపైనే ఉందని వారు సక్రమ మార్గంలో పయనించి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని దీనికి ఎలాంటి దురలవాట్లకు లోనుకాకుండా ఉండాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య అన్నారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఛైర్పర్సన్గా వ్యవహరించే నషా ముక్త్ భారత్ అభియాన్, జిల్లా అధికారులు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ ప్రస్తుతం సమాజాన్ని అల్కహాల్, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు పట్టి పీడిస్తున్నాయని వాటికి దూరంగా ఉండేలా యువత, పెద్దలు కృషి చేయాలన్నారు. విద్యార్థులు, యువత ఉన్నత లక్ష్యంతో వెళ్తున్న క్రమంలో ఏమాత్రం పెడదారిన వెళ్ళినా వారి జీవితాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని దీనిని తల్లిదండ్రులు గుర్తించాల్సిందిగా కోరారు. మత్తు పదార్థాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉన్నప్పుడే నవసమాజం నిర్మాణమవుతుందని అందుకు కృషి చేయాలని కోరారు. అలాగే జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాల వాడకం నియంత్రణకు యాక్షన్ప్లాన్ రూపొందించాలని జిల్లా అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు. దీంతో పాటుగా ఇప్పటికే మత్తుపదార్థాలకు బానిసలైన వారిని గుర్తించి వారికి అవసరమైన చికిత్స అందచేయడం జరుగుతుందని వారు పూర్తి స్థాయిలో మత్తు పదార్థాలను మానివేసి కొత్త జీవితాన్ని ప్రారంభించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య వివరించారు. మత్తు పదార్థాల మీద ప్రజలకు అవగహన కార్యక్రమాలు విస్తృతముగా చేపట్టాలని అధికారులకు సూచించినారు . ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి అక్కేశ్వరరావు, ఆయా శాఖల జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రగ్ ఫ్రీ కంట్రీగా రూపొందించేందుకు కృషి చేస్తామని జిల్లా అధికారులు సమావేశంలో ప్రతిజ్ఞ చేశారు.