సమస్యల నిలయంగా భగత్ సింగ్ నగర్.

 

చినుకు పడిందా… చిత్తడి చిత్తడే..!

రోడ్లు తవ్వారు… వేయడం మరిచారు.

రోడ్లన్నీ రాళ్లు రప్పలతో .. బురదమయం!

అధ్వానంగా మారిన బస్తి ..ప్రమాదాల బారిన పడుతున్న ద్విచక్ర వాహనదారులు.

ప్రజా సమస్యలు పై ఇప్పటికీ జాడలేని ప్రజాప్రతినిధులు..సంబంధిత అధికారులు

(కుత్బుల్లాపూర్, ప్రజాబలం న్యూస్ ప్రతినిధి విజయ్) ఆగష్టు 09

ఏ కాలనీ వాసులైన ప్రభుత్వం నుండి స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ నుంచి ఆశించేది కాలనీలో మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరుకోవడం. కానీ ఎన్నికలప్పుడే కనిపించే రాజకీయ నాయకులు, కనుచూపుమేర కూడా కనిపించని అధికారులతో సమస్యలు పరిష్కారం కాక ఈ బస్తివాసులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. బాధ్యతలు మరిచిన ప్రజా ప్రతినిధులతో, నిర్లక్ష్యమే తమ అలవాటుగా మార్చుకున్న అధికారులతో కాలనీవాసులకు కష్టాలు తప్పడం లేదు. సమస్యలకు నిలయంగా మారిన భగత్ సింగ్ నగర్ సమస్యలపై ” ప్రజాబలం న్యూస్ ” ప్రత్యేక కథనం.

గాజులరామారాం సర్కిల్ (26), చింతల్ (128) డివిజన్ లోని భగత్ సింగ్ నగర్ సమస్యలకు నిలయంగా మారింది. కాలనీలోని రోడ్లు గుంతలమయంగా తయారై ప్రమాదకర స్థితికి చేరిన పట్టించుకునే నాధుడే కరువయ్యారు. గత రెండు సంవత్సరాల క్రితం డ్రైనేజీ పైప్ లైన్ కోసం తవ్విన రోడ్డును పూర్తిస్థాయిలో పూర్చకపోవడం, రోడ్డు వేయకపోవడంతో ఆ రోడ్డు వెంట ప్రయాణించాలంటేనే కాలనీవాసులు భయపడుతున్నారు. చిన్న చినుకు పడితే చాలు… ఈ రోడ్డు మార్గం చిత్తడిగా తయారై రాకపోకలకు నరకం కనిపిస్తుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లకోసారి వచ్చే నాయకుల దృష్టికి ఈ సమస్యను ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేని సమయంలో సైతం ఈ రోడ్డులో కంకర తేలి ఉండడంతో పాదాచారులు నడవడానికి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు జారిపడి ఆసుపత్రి పాలైన సంఘటనలు చాలానే ఉన్నాయన్నారు. ఈ రోడ్డులో వచ్చే ద్విచక్ర వాహనదారులు సైతం ప్రమాదాల బారినపడి కాళ్లు, చేతులు విరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. ఓట్ల కోసమే వచ్చే నాయకులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్న చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు స్థానిక ప్రజాప్రతినిధులు..సంబంధిత అధికారులు ఉన్నారా..? లేరా..? అని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు..? ఇప్పటికైనా భగత్ సింగ్ నగర్ లో రోడ్లు వేయాలని, కాలనీ సమస్యలను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking