వేడుకగా స్మార్ట్ కిడ్జ్ పాఠశాల వార్షికోత్సవం

 

హాజరైన మేయర్ పూనకొల్లు నీరజ కన్వీనర్ మువ్వా ట్రస్మా కాంతారావు

ఆకట్టుకున్న అయోధ్య రామాలయ ప్రతిష్టాపన నృత్య రూపకం

హోరెత్తించిన విద్యార్థుల నృత్యాలు

ఖమ్మం ప్రతినిధి మార్చి 23 (ప్రజాబలం) ఖమ్మం
స్మార్ట్ కిడ్జ్ పాఠశాల 12వ వార్షికోత్సవం స్థానిక సప్తపది ఫంక్షన్ హాల్లో శనివారం రాత్రి వేడుకగా జరిగింది. తొలుత నగర మేయర్ పూనకొల్లు నీరజ, ఫెమా కన్వీనర్ మువ్వా శ్రీనివాసరావు, పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య, ట్రస్మా జిల్లా అధ్యక్షులు కాంతారావు, విద్యావేత్త నాగప్రవీణ, పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య జ్యోతి ప్రజ్వలన చేశారు. విద్యార్థుల స్వాగతం నృత్యంతో ప్రారంభమైన ఈ వార్షికోత్సవ సభలో పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య అధ్యక్ష ఉపన్యాసంలో మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా తమ పాఠశాలలో విద్యార్థులను ఆల్రౌండర్లుగా తీర్చి దిద్దుతున్నామని తెలిపారు. చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతికం, ఇన్స్పైర్ సైన్స్ ఎక్స్పో, పర్వదినాల నిర్వహణ, మహనీయుల ఉత్సవాలు, ఒలంపియాడ్ పోటీ పరీక్షల్లో విద్యార్థులను నిరంతరం ప్రోత్సహిస్తు న్నామన్నారు. తల్లిదండ్రులు అందిస్తున్న ప్రోత్సాహంతో పాఠశాలను ఆధునిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ముఖ్యఅతిథి నగర మేయర్ పూనకొల్లు నీరజ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని ఉన్నతంగా ఎదగాలని కోరారు. తల్లిదండ్రులకు, పాఠశాలకు గౌరవాన్ని ఇనుముడింప చేయాలని వివరించారు. చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుకే పరిమితం చేయకుండా అన్ని అంశాలలో ప్రోత్సహించాలని కోరారు. సెల్ ఫోన్లకు పిల్లలను దూరంగా ఉంచి సహజమైన ఆటల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం ద్వారా శారీరకంగా, మానసికంగా పిల్లలు ఉత్సాహంగా ఎదుగుతారని తెలిపారు.ఫెమా కన్వీనర్ మువ్వా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో విద్యార్థులను అన్ని రంగాలలో నైపుణ్యాలు పెరిగేలా తీర్చిదిద్దడం అభినందనీయం అన్నారు. తల్లిదండ్రులు ఈ పాఠశాలకు తమ సంపూర్ణ సహకారాన్ని ఇకముందు కూడా అందించి పాఠశాల యాజమాన్యానికి అండగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు కాంతారావు , విద్యావేత్త నాగ ప్రవీణ, పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సభలో ఇన్స్పైర్ సైన్స్ ఎక్స్పో , క్రీడా పోటీలు , పాఠశాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందించారు. అదేవిధంగా తల్లిదండ్రులకు గ్రాండ్ పేరెంట్స్ కు నిర్వహించిన క్రీడా పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. సబానంతరం అయోధ్య రామాలయం ప్రతిష్టాపన ఉత్సవ నృత్య రూపకం ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. జానపద, గిరిజన సాంప్రదాయ పాశ్చాత్య నృత్యాలు అందరినీ హుషారెత్తించాయి.ఈ వార్షికోత్సవాన్ని పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య, పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య లు పర్యవేక్షించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking