ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం

పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో విద్యలో ఏకాగ్రత మెరుగు

పిల్లలతో కలిసి సహపంక్తి అల్పాహారం స్వీకరించిన కలెక్టర్,ఎమ్మెల్యే

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి(ప్రజాబలం)6 అక్టోబర్:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని, దీని ద్వారా పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించడంతో పాటు వారిలో చదువుపై శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతుందని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఉదయం అందించే అల్పాహారం (బ్రేక్ఫాస్ట్) పథకాన్ని కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సీడీఎంఏ పమీలా సత్పతితో కలిసి కలెక్టర్ అమోయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దుండిగల్ మున్సిపల్ పరిధిలోని బహుదూర్పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి,మొక్కలు నాటి లాంఛనగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కమిషనర్ అండ్ డైరెక్టర్ అఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పమిలా సత్పతి, కలెక్టర్ అమోయ్ కుమార్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషకరమని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అల్పాహారాన్ని అందించడం జరుగుతుందని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పిల్లలకు నచ్చిన టిఫిన్లను నాణ్యతతో అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని 505 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 90 వేల మంది విద్యార్థులకు ప్రారంభిస్తున్నామని, విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించడం వల్ల వారి ఎదుగుదలకు దోహదపడడంతో పాటు తరగతి గదిలో విద్యార్థుల ఏకాగ్రత పెరుగుతుందని కలెక్టర్ అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం మెనూ రూపొందించిందని దాని ప్రకారం నాణ్యతతో విద్యార్థులకు అల్పాహారం అందిస్తామని కలెక్టర్ అమోయ్ కుమార్ వివరించారు. కలెక్టర్ ముఖ్యమంత్రి అల్పాహారం పథకం ప్రారంభించి విద్యార్థులతో కలిసి ముచ్చటిస్తూ అందుతున్న సౌకర్యాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు,
ఈ సందర్బంగా కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకంతో ఎంతో మంది పేద పిల్లలకు మంచి పౌష్టిక ఆహారాన్ని అందించి వారి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలికినట్లు తెలిపారు. ఈ తరం పిల్లలు సీఎం కేసీఆర్ స్ఫూర్తి తో మరింత ముందుకు వెళ్లి జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే వివేకానంద్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో దుండిగల్ కమీషనర్ కె సత్యనారాయణ, కౌన్సిలర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking