ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 3 (ప్రజాబలం) ఖమ్మం ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. శనివారం ఖమ్మం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మేయర్ అధ్యక్షతన, కమీషనర్ ఆదర్శ్ సురభి సమక్షంలో చేపట్టారు. సమావేశంలో ఇండస్ట్రియల్, కమర్షియల్ ఉపయోగార్థం నుండి నివాసయోగ్యం ఉపయోగార్థం కొరకు మార్పునకు సంబంధించి 6 అంశాలకు ప్రభుత్వ అనుమతికి ప్రతిపాదనలు సమర్పించడానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. సానిటేషన్ కమ్ మల్టీ పర్పస్ వర్కర్లకు వేతన పెంపుకు పరిపాలన అనుమతుల కొరకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. మునిసిపల్ స్టాండింగ్ కౌన్సిల్ పారితోషకం చెల్లింపు, రిటైర్డ్ తహసీల్దార్, ఎంవిరాన్మెంటల్ ఇంజనీర్, హార్టికల్చర్ ఉద్యోగుల సేవలు పొడిగింపు, కమీషనర్ క్యాంపు కార్యాలయం అద్దె చెల్లింపు, డిఆర్ఎఫ్ సిబ్బంది కాల పరిమితి పొడిగింపు, వాణిజ్య ప్రాంతాలలో దుకాణాల నుండి చెత్త, భారీ ఘన వ్యర్థాల సేకరణ టెండర్ల ఆమోదం తదితర అంశాలపై కౌన్సిల్ చర్చించి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ, పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. నగరంలో కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. త్రాగునీరు ప్రతిరోజూ అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్పొరేటర్లు తెలిపిన సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి, పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు.
సమావేశంలో నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ, కుక్కలకు స్టెరిలైజ్ చేసి, యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేసి, తిరిగి తెచ్చిన ప్రాంతంలోనే వదిలేయాలని నిబంధనలు ఉన్నట్లు తెలిపారు. 2021 సం.లో 1830 2022 సం.లో 1115 కుక్కలకు స్టేరీలైజ్ చేయగా, 2023 సం.లో 2600 కుక్కలకు చేసినట్లు, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ కుక్కలకు చేయనున్నట్లు తెలిపారు. ఎస్డీఎఫ్ క్రింద ప్రభుత్వం రూ. 50 కోట్లు మంజూరు చేయగా, రూ. 22 కోట్ల పనులు పూర్తయినట్లు, ఇంకనూ ప్రారంభం కాని పనుల విషయమై, ప్రభుత్వ అనుమతులు పొందిన పిదప చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. 2014 సంవత్సరంలో వినియోగం ప్రకారం అమృత్ ద్వారా త్రాగునీటి సరఫరా పనులు చేసినట్లు, ఇప్పుడు అమృత్ పథకం ద్వారా రూ. 200 కోట్లు వస్తాయని, విలీన గ్రామాలు, పైప్ లైన్ లేనిచోట, గ్యాప్స్ ఉన్న చోట పనులు పూర్తిచేయనున్నట్లు ఆయన అన్నారు. 18 ఇఎల్ఎస్ఆర్ లకు గాను బాలపేట మినహా అన్నిచోట్లా పనులు పూర్తయినట్లు తెలిపారు. ప్రతిరోజూ తాగునీటి సరఫరాకై అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. అవుట్ సోర్సింగ్ వర్కర్ల గురించి కౌన్సిల్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు. కూల్చివేతల గురించి నోటీసుల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో 25 చోట్ల రూ. 45 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకొని, ఫెన్సింగ్, సిసి కెమెరాలతో రక్షణ చర్యలు చేపట్టామన్నారు. పిఓటి అతిక్రమణలు ఉన్నవారికి ఇంటి నెంబర్ల విషయమై చర్యలు చేపడతామన్నారు. ఉద్యోగుల జాబితా ఆయా కార్పొరేటర్లకు అందజేస్తామన్నారు. కార్పొరేటర్లు లేవనెత్తిన ప్రతి సమస్యపై పరిశీలించి, చర్యలు తీసుకుంటామని కమీషనర్ అన్నారు ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, కార్పొరేటర్లు, విద్యుత్ శాఖ ఎస్ఇ సురేందర్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సిహెచ్. స్వామి, నగర పాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.