ప్రజాబలం మంచిర్యాల జిల్లా సెప్టెంబర్ 19 : జిల్లాలోని రైస్ మిల్లులకు సామర్థ్యానికి అనుగుణంగా కేటాయించిన సి.ఎం.ఆర్.లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని,నిర్లక్ష్యం వహించిన రైస్ మిల్లులపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సబావత్ మోతిలాల్,జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ లతో కలిసి పౌరసరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని రా రైస్ మిల్లులు, బాయిల్డ్ రైస్ మిల్లులకు ఖరీఫ్ సంబంధించి నిర్దేశించిన సి.ఎం.ఆర్. లక్ష్యాలను ఈ నెల 30వ తేదీ లోగా, స్టేట్ పూల్ రైస్కు సంబంధించి ఈ నెల 24వ తేదీ లోగా పూర్తి చేసే విధంగా అధికారులు, రైస్ మిల్లర్లు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసిన రైస్ మిల్లులకు పెండింగ్లో ఉన్న రైస్మిల్లుల నుండి కొంత భాగంగా తరలించేలా చర్యలు తీసుకోవాలని, లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం, అలసత్వం వహించిన రైస్మిల్లర్లకు ధాన్యం కేటాయించడం జరుగదని,చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.