జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

 

డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పరిస్థితులపై ప్రతివారం సమావేశం ఏర్పాటు

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్,

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా: జిల్లా వ్యాప్తంగా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకు సంబంధించి త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళపై ఆర్ అండ్ బీ ఈఈ శ్రీనివాసమూర్తి, పంచాయతీరాజ్ ఈఈ సుమేధా, ఆర్డీవోలు శ్యామ్ప్రకాశ్ రాజేశ్కుమార్, గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎమ్సీ), సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో కలెక్టర్ గౌతమ్ అధికారుల నుంచి జిల్లాలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి అన్ని వివరాలను పూర్తి స్థాయిలో అడిగి తెలుసుకొన్నారు. అనంతరం కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఏమాత్రం పెండింగ్ ఉండకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు పూర్తయ్యాయి… ? ఎన్ని ఇళ్ళను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ? ఇంకా ఎన్ని ఇళ్ళు ఏఏ దశలో పెండింగ్ పనులు ఉన్నాయి ? ఫినిషింగ్ (పూర్తయ్యే స్థాయిలో) ఎన్ని ఉన్నాయనే పూర్తి వివరాలను ఆయా నియోజకవర్గాల అధికారులను అడిగి తెలుసుకొన్నారు. దీంతో పాటు ప్రస్తుతం అందచేసే డబుల్ బెడ్రూమ్లను తప్పకుండా అర్హులైన లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం అందచేయాలని కలెక్టర్ గౌతమ్ సమావేశంలో అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు కేటాయింపులకు సంబంధించిన వివరాలను, పంపిణీ ప్రక్రియను అధికారులు జిల్లా కలెక్టర్ గౌతమ్కు వివరించారు. అలాగే రాజీవ్ గృహకల్ప ఇళ్ళపై సమీక్ష సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను తెలుసుకొన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అధికారులు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళపై పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేయాలని… పనులను త్వరితగతిన పూర్తి చేసి ఏమాత్రం పెండింగ్ లేకుండా ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ గౌతమ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళపై ప్రతి వారం సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఈ సమావేశానికి అధికారులు సమగ్ర సమాచారం తప్పకుండా హాజరు కావాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అర్హులకు అందచేయనున్న డబుల్ బెడ్రూమ్లలో అన్ని రకాల వసతులు, సౌకర్యాలు కల్పించాలని ఈ విషయంలో సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ గౌతమ్ సూచించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కేటాయింపులు జరిగిన అనంతరం లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తుగానే పూర్తి స్థాయిలో వసతులు కల్పించి వారికి అందచేయాల్సిన అవసరం ఉందని ఈ విషయంలో ఏఏ అవసరాలు ఉన్నాయో అధికారులు ప్రత్యక్షంగా డబుల్ బెడ్రూమ్ల వద్దకు వెళ్ళాల్సిందిగా కలెక్టర్ గౌతమ్ సమావేశంలో అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు డబుల్ బెడ్రూమ్ విషయాలపై పలు విషయాలను జిల్లా కలెక్టర్ గౌతమ్ దృష్టికి తీసుకురాగా అందుకు సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు శ్యామ్ ప్రకాశ్, రాజేశ్కుమార్, గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎమ్సీ) అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking