ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 13 (ప్రజాబలం)ఖమ్మం ప్రజా చైతన్యమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) చేపట్టిన ప్రజాపోరు యాత్ర 14న ఉదయం తొమ్మిది గంటలకు సత్తుపల్లిలో ప్రారంభం కానుందని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ నేడొక ప్రకటనలో తెలిపారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన అనంతరం సత్తుపల్లి అంబేడ్కర్ సెంటర్లో సభ జరుగుతుందన్నారు. బిజెపి హఠావో – దేశ్కి బచావో అనే నినాదంతో భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జాతీయ సమితి పిలుపు మేరకు ఖమ్మంజిల్లాలో యాత్ర చేపట్టడం జరుగుతుందన్నారు. సీతారామ సహా పెండింగ్ లో ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రుణమాఫీని ఏక మొత్తంగా అమలు చేయాలని, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని, సొంత స్థలాల్లో ఇండ్లు నిర్మించుకునే వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని, ఎన్ఆర్ ఈ జిఎస్ పథకాన్ని సరళతరం చేసి రోజుకు రూ. 600 కూలీ గిట్టుబాటు అయ్యేవిధంగా, 200 పని దినాలు కల్పించాలని, రైతులకు గిట్టుబాటు ధర, పోడు సాగుదారులకు పట్టాలు అందించాలనే తదితర డిమాండ్స్ తో ఈ యాత్ర సాగుతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బిజెపి విధానాలను గ్రామ గ్రామాన ప్రజలకు వివరిస్తామని ప్రసాద్ తెలిపారు. తొలి రోజు యాత్రను సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు ప్రారంభిస్తారన్నారు. సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ, ఏన్కూరు మండలాల్లో తొలి రోజు యాత్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు.