పార్లమెంట్ అభివృద్ధి (ఎంపీ ల్యాడ్స్) నిధులను మార్చి నెలాఖరుకు వినియోగించాలి
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 31:
జిల్లా వ్యాప్తంగా అన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని ఎక్కడ కూడా పనులు పెండింగ్లో ఉండకుండా చూడాలని ఈ విషయంలో ఆయా శాఖల అధికారులు అధికారులు పూర్తి సమన్వయంతో పనులను చేపట్టాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా ప్రణాళిక అధికారి (సీపీవో) ఎం. మోహన్ రావు తో కలిసి నియోజకవర్గ అభివృద్ధి నిధులు (కాన్సిట్యూషన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ –సీడీఎఫ్) పార్లమెంట్ ప్రాంత అభివృద్ధి నిధులు (మెంబెర్ అఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ – ఎంపీ ల్యాడ్స్) క్రుషియల్ బ్యాలెన్స్డ్ ఫండ్ (సీబీఎఫ్), ప్రత్యేక అభివృద్ధి నిధులు (స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ – ఎస్డీఎఫ్)కు సంంధించి జిల్లాలోని రహదారులు భవనాలు (ఆర్ అండ్ బీ ) పంచాయతీరాజ్, అటవీ శాఖ (డీఎఫ్వో), జిల్లా అభివృద్ధి నిధులు, డీడబ్ల్యువో, డీఆర్డీఏ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, పోలీసు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ. జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయడానికి ఆస్కారముంటుందన్నారు. ఎంపీ ల్యాడ్స్కు సంబంధించి మార్చి 31వ తేదీ వరకు పూర్తి చేయాలని ఈ విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ వహించరాదని సూచించారు. అలాగే జిల్లాలోని ఆయా నియోజకవర్గాల అభివృద్ధి నిధులతో పాటు ప్రత్యేక అభివృద్ధి నిధులు (ఎస్డీఎఫ్) వర్క్స్ సంబంధించి పనులు ఫిబ్రవరి చివరి వరకు పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ గౌతమ్ దిశానిర్ధేశం చేశారు. అంతకు ముందు అధికారులతో అభివృద్ధి పనులపై నియోజకవర్గాల వారీగా పనుల పురోగతిని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు ఇప్పటి వరకు ఎన్ని పనులు పూర్తి అయ్యాయి ? ఇంకా ఎన్ని పనులు ఏఏ స్థాయిలో పెండింగ్ దశల ఉన్నాయి…? పూర్తిగా క్యాన్సల్ అయినవి ఎన్ని ? అనే వివరాలను తెలుసుకున్నారు. జిల్లాలో పనులు చేయని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ విషయంలో వేరే వారికి ఆ పనులను అప్పగించడం జరుగుతుందని దీనిని దృష్టిలో పెట్టుకొని పెండింగ్ పనులను కాంట్రాక్టర్లు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు ప్రజల కోసం అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకునే దిశగా అధికారులు కృషి చేయాని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. అలాగే మరో పదిహేను రోజుల తర్వాత సమావేశాన్ని నిర్వహిస్తామని ఆ సమావేశం సమయం వరకు అభివృద్ధి పనులు పూర్తయ్యేలా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా అధికారులు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.