ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూన్ 25:
ధరణి లో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం రోజున కీసర మండలంలోని ఆర్డీవో కార్యాలయం సందర్శించారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్ణీత గడువులోగా ధరణికి సంబంధించిన అన్ని దరఖాస్తులను క్లియర్ చేయాలని అన్నారు. అన్ని మాడ్యుల్స్ లో దాఖలైన ధరణి దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలి అన్నారు. ధరణి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.రెవెన్యూ అధికారులతో పాటు ఆపరేటర్లను కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయని, వాటిలో ఎన్ని పరిష్కరించారు, ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయని ఆరా తీశారు. పెండింగ్ ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. సక్సేషన్, పెండింగ్ మ్యూ టేషన్ వంటి దరఖాస్తులను అవసరమైన రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, డేటా కరెక్షన్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన తర్వాతే పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జా చేస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి, వారిపై చట్టపరంగా క్రిమినల్ కేసులు పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కీసర ఆర్డిఓ ఉపేందర్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.