ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..బుధవారం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జామ్ ప్రభుత్వ సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదిలో పదవ తరగతి విద్యార్థులకు పాఠాలను బోధించి సబ్జెక్టుల వారిగా ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. విద్యార్థులచే సామాన్య శాస్త్ర పటాలు వేయించి వాటి వివరణలను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానాల్లో నిలవాలని అన్నారు.ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, నోటు, పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందించడం జరుగుతుందని అన్నారు.కష్టపడి చదివి పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పాఠశాలకు గుర్తింపు తీసుకురావాలని అన్నారు.విద్యార్థులకు అందిస్తున్న విద్య, భోజనం,ఇతర సౌకర్యాలను వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతకముందు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి పాఠశాల ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు. పాఠశాల ఆవరణలో పచ్చదనం పెంపొందేలా విరివిగా మొక్కలు నాటాలని సిబ్బందికి సూచించారు.నాటిన ప్రతి మొక్కను విద్యార్థులు, ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకొని వాటిని సంరక్షించాలని అన్నారు. అనంతరం వంట గదిని పరిశీలించి, పరిశుభ్రతను పాటించాలని నాణ్యమైన కూరగాయలను వినియోగించాలని సిబ్బందికి సూచించారు. ప్రతిరోజు విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, అల్పాహారం అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు వండిన ఆహారాన్ని,వంటకు ఉపయోగిస్తున్న బియ్యం, కూరగాయలు, ఇతర వస్తువులను కలెక్టర్ పరిశీలించారు.వంటకు నాణ్యమైన వస్తువులను మాత్రమే వినియోగించాలన్నారు. విద్యార్థుల వసతి గృహాలను తనిఖీ చేసి తరగతి గదుల్లో, భోజనశాలలో,వసతి గృహాల్లో అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. వసతిగృహ ప్రాంగణంలో వర్షపు నీరు నిలవకుండా ప్రతిరోజు శుభ్రం చేయాలని సూచించారు. వర్షాకాలం వ్యాధులు సోకకుండా విద్యార్థులకు వసతి గృహంలో వైద్య సౌకర్యాన్ని కల్పించాలని, అత్యవసర మందులను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.జామ్ సారంగాపూర్ శివారు ప్రాంతంలో రైతులు, అధికారులతో కలిసి ఆమె మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వన మహోత్సవంలో పచ్చదనం పెంపుకు ఖాళీ ప్రదేశాలలో విరివిగా మొక్కలు నాటాలని నాటిన ప్రతి మొక్కను రక్షించాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు. మొక్కలకు రక్షణ కంచెను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు.రోగులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలోని, ఇన్ పేషెంట్,అవుట్ పేషెంట్ విభాగాలు, ల్యాబ్,టీకాల గది, ఫార్మసీ, ప్రసూతి గదులను సందర్శించి వైద్యులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని, అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రికి సంబంధించి రిజిస్టర్లు, మందులు, ఇతర వైద్య పరికరాల స్టాకు రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అవసరమైన వైద్య పరికరాలు, మందులకు సంబంధించిన వివరాలను సిద్ధంచేసి నివేదికలు పంపాలన్నారు. అనంతరం మండల తహసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి,ధరణి రిజిస్ట్రేషన్ విభాగాన్ని పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.రికార్డు గదిలో రిజిస్టర్లను తనిఖీ చేశారు. అన్ని రకాల రిజిస్టర్ లను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న అన్ని రకాల పౌర సేవల దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్వర్ణ ప్రాజెక్టును కలెక్టర్ సందర్శించారు. ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లు, జనరేటర్ గది, సమాచారానికి సంబంధించిన బోర్డులను ఆమె పరిశీలించారు.గేట్లు, ప్రాజెక్టు నిల్వ నీటి, సామర్థ్యం,ప్రస్తుతం నిల్వ ఉన్న నీరు ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమాలలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి,జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.ధన్ రాజ్, నీటిపారుదల శాఖ ఈఈ లక్ష్మి, డీఈ శ్రీనివాస్,తాహసిల్దార్ శ్రీదేవి,ఎంపీడీవో లక్ష్మీ కాంతారావు, రెవెన్యూ, వైద్య,ఇరిగేషన్, పంచాయితీ రాజ్ శాఖల అధికారులు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking