పీఎం విశ్వకర్మ యోజన పథకానికి లబ్దీదారుల గుర్తింపును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..గురువారం సాయంత్రం నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీఎం విశ్వకర్మయోజన పథకంపై నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, పీఎం విశ్వకర్మ పథకం అర్హులైన లబ్దిదారులకు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లబ్దీదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో పంచాయతీ సెక్రటరీలు అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని, లబ్దీదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు. అర్హులైన 18 రకాల చేతి వృత్తుల వారికి మొదటి విడతలో ఐదు శాతం వడ్డీకే లక్ష రూపాయల ఋణాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని 18 నెలల్లో చెల్లించిన వారికి రెండో విడతలో 2 లక్షల ఋణాన్ని ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ధర్జీలు, వడ్రంగులు, మంగలి, చాకలి వారు, ఇతర చేతి వృత్తుల లబ్ధిదారులు ఈ పథకానికి అర్హులని తెలిపారు. అనంతరం గ్రామాలవారీగా ఇప్పటివరకు దరఖాస్తుల నమోదు వివరాలపై అధికారులతో కలెక్టర్ చర్చించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు ఫైజాన్ అహ్మద్, జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహ రెడ్డి, డీపీవో శ్రీనివాస్, మెప్మా పీడీ సుభాష్, స్టీరింగ్ కమిటీ సభ్యులు రాజు, రాజేశ్వర్ రెడ్డి, గంగాధర్,బ్యాంక్ అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.