గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజల సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..గురువారం గణేష్ ఉత్సవాల సందర్భంగా నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఏఎస్పి అవినాష్ కుమార్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు. ఈ సందర్భం కలెక్టర్ మాట్లాడుతూ, గణేష్ నవరాత్రి ఉత్సవాల పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బైంసాలో పట్టణంలో దాదాపు 200 గణేశుని మండపాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, ప్రతి మండపం దగ్గర సీసీ కెమెరాలు, పోలీసు భద్రతను ఏర్పాటు చేయాలని సూచించారు. పట్టణంలో పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ నిరంతరం పారిశుద్ధ్యం నిర్వహించాలన్నారు. ఉత్సవాల సందర్భంగా పట్టణంలోని ముఖ్య కూడళ్లు, ప్రధాన రహదారులలో అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు. నిమజ్జనం జరిగే మార్గాన్ని పరిశీలించి, ఆ మార్గంలో శోభాయాత్రకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రహదారులను సిద్ధం చేయాలన్నారు. శోభయాత్ర మార్గంలో ఉన్న గుంతలను పూడ్చివేయాలని ఆదేశించారు.విద్యుత్ సరఫరా చేయాలని, లూజ్ వైర్లు సరిచేయాలనీ ఆదేశించారు. గడ్డెన్న వాగు ప్రాజెక్టు వద్ద నిమజ్జనం ప్రాంతాన్ని సందర్శించారు. ఆ ప్రాంతంలో క్రేయిన్లు, లైటింగ్, భారీకేడ్లు, పోలీసు భద్రత వంటి సౌకర్యాలను కల్పించాలని ఆదేశించారు. నిమజ్జనం సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. చిన్నపిల్లలు నిమజ్జనం ప్రాంతం సమీపంలోనికి రాకుండా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కోమల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజేష్ కుమార్, రెవెన్యూ, మున్సిపల్, పోలీసు శాఖల అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.