ఫుడ్ ఫాయిజన్ వలన అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ప్రభుత్వ సంస్థల్లో చదివే విద్యార్థులఫాయిజన్ వలన అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి పరిశుభ్రమైన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
శనివారం నర్సాపూర్ (జి) కేజీవీబీ పాఠశాలలో వంటగది, డైనింగ్ హాల్, వంట కోసం ఉపయోగించే వాటర్ ట్యాంకును పరిశీలించి అధికారులకు ఆయన పలు సూచనలు చేసారు. ఫుడ్ ఫాయిజన్ వలన అస్వస్థతకు గురైన విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఫుడ్ ఫాయిజన్ వలన అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని ఆదేశించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరిగితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రతిరోజూ మెనూ ప్రకారం శుభ్రమైన భోజనం అందించాలని ఆదేశిచారు. భోజనానికి నాణ్యమైన కూరగాయలు, సరుకులనే వాడాలని అన్నారు. ఈ ఘటనకు సంబంధిచి నివేదికను అందజేయాలని ఆదేశించారు.
ఆ తర్వాత గ్రామంలోని మిషన్ భగీరథ నీటి ట్యాంకు పైకి ఎక్కి ట్యాంకును పరిశీలించారు, నీటి సరఫరాకి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీరు ప్రతీ ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిరంతరం నీటి ట్యాంకులను శుభ్రం చేస్తూ, క్లోరినేషన్ చేయాలనీ సూచించారు. అవసరమైన మరమ్మత్తులు పూర్తి చేసి నీటి సరఫరాలో ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
అనంతరం కుంటాల మండలం ఆర్లి లోని రైస్ మిల్లును కలెక్టర్ సందర్శించి, కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్ధేశించిన లక్ష్యాన్ని, పూర్తయిన మిల్లింగ్ వివరాలను, మిల్లులోని ధాన్యం నిల్వలు, కెపాసిటీ తదితర అంశాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మిల్లులో పరిశుభ్రతతో పాటు ప్రభుత్వ నిబంధనలు పాటించని మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
ఆ తర్వాత నర్సాపూర్ (జి) మండలంలోని రాంపూర్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా చేపట్టనున్న పనులను రెండు వారాల్లోపు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్, మరుగుదొడ్ల, నీటిసరఫరా, స్లాబ్ లీకేజి వంటి వంటి పనులు చేపట్టాలని సూచించారు. పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి, ప్రతి పోలింగ్ కేంద్రం లో విద్యుత్, వికలాంగులకు రాంప్ సౌకర్యం, మరుగుదొడ్లు, త్రాగు నీటి వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనీ అధికారులను ఆదేశిచారు.అనంతరం కలెక్టర్ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. పిల్లల హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. అనారోగ్యానికి గురికాకుండా పరిశుభ్రతను పాటించాలని సూచించారు.
అనంతరం నిర్మల్ పట్టణంలోని వైఎస్సార్ కాలనీ (సాయినగర్) లోని ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా చేపట్టిన పనులు, విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన వివరాలు, సదుపాయాలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాలలో డీ.ఈ.ఓ రవీందర్ రెడ్డి, డి.ఎం అండ్ ఎచ్.ఓ ధన్ రాజ్, డి.ఎస్.ఓ నందిత, మిషన్ భగీరథ డి.ఈ సందీప్, మున్సిపల్ కమిషనర్ రాజు, మున్సిపల్ డీ ఈ సంతోష్, తహసీల్దార్లు శ్రీనివాస్, ఎజాస్, కేజీవీబీ ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.