మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులలో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదేశం

ఖమ్మం ప్రతినిధి జనవరి 20 (ప్రజాబలం) ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి తో కలిసి స్థానిక ఇందిరానగర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, రోటరీనగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన బస్తీ-మన బడి కార్యక్రమం క్రింద చేపట్టిన పనుల పురోగతిని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో రూ. 23.27 లక్షలతో, రోటరీనగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ. 40 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. వీటిలో కాంపౌండ్ వాల్, వంట గదులు, డైనింగ్ హాల్, టాయిలెట్ బ్లాకులు, విద్యుత్, మైనర్, మేజర్ మరమ్మత్తు పనులు ఉన్నాయన్నారు. పనులు పూర్తగు దశలో ఉన్నట్లు ఆయన అన్నారు. టాయిలెట్ బ్లాకుల వద్ద ఖాళీ ప్రదేశాల్లో సువాసన వచ్చే మొక్కలు నాటాలన్నారు. పెయింటింగ్ పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రవేశం వద్ద గెట్ తోపాటు ఆర్చ్ నిర్మాణం చేయాలన్నారు. పనులు జరుగుతున్నందున పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. పనుల పురోగతిపై పర్యవేక్షణ చేయాలన్నారు. పూర్తయి పనులకు ఎంబి తదితర రికార్డులను వెంట వెంటనే సమర్పించి, చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.

కలెక్టర్ తనిఖీల సందర్భంగా మునిసిపల్ ఇఇ కృష్ణ లాల్, మండల విద్యాధికారి శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధు, అధికారులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking