ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 19 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా రానున్న శాసనసభ ఎన్నికల దృష్ట్యా వైరా నియోజకవర్గానికి సంబంధించి ఇవిఎం ల భద్రత, రిషిప్షన్ కేంద్ర ఏర్పాటుకు సాంఘీక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల భవనాలను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి గురువారం పరిశీలించారు. వైరా అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి రాండమైజేషన్ తదుపరి ఇవిఎంలు రానున్నట్లు వారు తెలిపారు. మొదట రెసిడెన్షియల్ కళాశాలకు సంబంధించి నూతన భవనాన్ని పరిశీలించి, ఇవిఎం స్ట్రాంగ్ రూం, కమీషనింగ్ కు అనువైన గదుల గురించి పరిశీలించారు. గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్థుల గదులు అన్ని పరిశీలించి, గదుల నిడివి, ఇవిఎం ల భద్రపర్చడం గురించి ఆలోచన చేశారు. అనంతరం రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాలలకు సంబంధించి ఉన్న పాత భవనాలను పరిశీలించారు. డైనింగ్, డార్మిటరి, ఇతర గదులు పరిశీలించి, పాత భవనాల్లోనే ఇవిఎం, స్ట్రాంగ్ రూం ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇవిఎం స్ట్రాంగ్ రూంకు సంబంధించి ఒక తలుపు మాత్రమే ఉంచి, మిగతా తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లు ఇటుకలతో పకడ్బందీగా మూసివేయాలన్నారు. హాల్ లో ఇవిఎం, పోలింగ్ యంత్రాలు భద్రపర్చడానికి కావాల్సిన ఏర్పాట్లు వెంటనే చేపట్టి పూర్తి చేయాలన్నారు. భద్రత దృష్ట్యా చేపట్టాల్సిన బ్యారికెటింగ్, ఇతర చర్యల గురించి అధికారులకు సూచనలు చేశారు. రిషిప్షన్ కేంద్ర ఏర్పాటు, భోజన ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ ల ఏర్పాటుపై చుట్టూ తిరిగి పరిశీలించారు. చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. పాత భవనంలో ఎన్నికల సంబంధ పనులు చేపట్టనుండడంతో, నిర్మాణం పూర్తయిన క్రొత్త భవనంలో మిగిలిన టాయిలెట్, ఇతర చిన్న చిన్న పనులు యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. విద్యార్థినులు దశరా సెలవుల అనంతరం తిరిగి పాఠశాలకు, కళాశాలకు వస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు ఆలోగా పూర్తి చేయాలన్నారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్, శిక్షణా సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు డిసిపి ప్రసాద్ రావు, ఏసీపీ రహమాన్, విద్యాశాఖ ఇఇ నాగశేషు, డిఇ వైకుంఠాచారి, తహసీల్దార్లు శ్రీనివాస్, మునిసిపల్ కమిషనర్లు వెంకటేశ్వర్లు, ఎంపిడిఓ కరుణాకర్ రెడ్డి, విద్యాశాఖ ఏఇ సురేష్, అధికారులు తదితరులు ఉన్నారు.