సాధారణ ప్రసవాలను పెంచే దిశగా ప్రణాళికా బద్ద చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 28 (ప్రజాబలం) ఖమ్మం
జిల్లాలో సాధారణ ప్రసవాలను పెంచే దిశగా ప్రణాళికాబద్ద చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో సాధారణ ప్రసవాల పెంపుపై వైద్యాధికారులు, ప్రయివేటు ఆసుపత్రుల గైనకాలజీ డాక్టర్లతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో సాధారణ ప్రసవాల శాతం పెంచేలా ప్రణాళికాబద్ద చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలో 56 ప్రయివేటు ఆసుపత్రుల్లో 2023 సంవత్సరంలో 10,024 ప్రసవాలు జరగగా, ఇందులో 7,748 (77.29%) సి సెక్షన్‌ ఆపరేషన్‌తో జరగగా, 2315 (23.09%) మాత్రమే సాధారణ ప్రసవాలు జరిగాయి. ప్రయివేటు ఆసుపత్రుల్లో 80 శాతం వరకు సి సెక్షన్‌ ఆపరేషన్ల ద్వారా ప్రసవాలు జరుగుతున్నట్లు, ప్రత్యేక కార్యాచరణతో సాధారణ ప్రసవాలు పెంచే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ దిశగా ప్రయివేటు ఆసుపత్రులకు ఎదురవుతున్న సమస్యలపై దృష్టి పెట్టి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టి, సాధారణ ప్రసవాలు చేపట్టేలా, ప్రభుత్వ యంత్రాంగం తరఫున వారికి సహకరించాలన్నారు. జిల్లాలో సాధారణ ప్రసవాలు పెంపొందించే దిశగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రైవేట్‌ ఆసుపత్రిలో సైతం సాధారణ ప్రసవాలు జరిగే విధంగా కృషి చేయాలని కలెక్టర్‌ కోరారు. అధికంగా సీజెరియన్‌ ఆపరేషన్‌ నిర్వహించడాన్ని సమర్దించమని కలెక్టర్‌ స్పష్టం చేశారు. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్‌ తెలిపారు. పసి పిల్లల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు ప్రసవించిన తర్వాత మొదటి గంట సమయంలో అందించే ముర్రె పాలు కీలక పాత్ర పోషిస్తాయని, అధికంగా సీజెరియన్‌ ఆపరేషన్‌ జరగడం వల్ల కేవలం 36 శాతం పిల్లలకు మాత్రమే ముర్రే పాలు అందుతున్నాయని కలెక్టర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణ ప్రసవం చేసే అవకాశం ఉన్నప్పటికీ చిన్న చిన్న కారణాలు చూపుతూ సిజేరియన్‌ ఆపరేషన్ల వైపు వెళుతున్నారని, వీటిపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. జిల్లాలో జరిగే ప్రతి సీజెరియన్‌ ఆపరేషన్‌ సంబంధించి సమగ్ర వివరాలు, నివేదిక సమర్పించాలని, ప్రతి నివేదికను ఆడిట్‌ చేయడం జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. గర్భం దాల్చింది మొదలు పరీక్షల కొరకు వైద్యుల పర్యవేక్షణలో వుంటారని, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య స్థితిని పరీక్షిస్తూ, సాధారణ ప్రసవం ప్రయోజనాలు, సి సెక్షన్‌ ఆపరేషన్ల వల్ల కలిగే అనర్థాలపై గర్భిణీకి, గర్భిణీ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని అన్నారు. జిల్లాలో గర్భిణిల వివరాలు వైద్య శాఖ దగ్గర వుంటాయని, వాటి ప్రకారం చెకప్‌ ఏ రోజున చేయాల్సివుంది, చేయించుకున్నారా లేదా అనేది ప్రతి గర్భిణీ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ఇడిడి ప్రకారం ప్రతి రోజు ఎంతమంది వున్నారు, వారి ఆరోగ్య పరిస్థితిని గమనించాలని, సరైన సమయంలో ఆసుపత్రికి వచ్చేలా చూడాలని అన్నారు. 12 ఆసుపత్రులలో ఎక్కువగా సిజేరియన్‌ కాన్పులు జరగడం గమనించిడం జరిగినదని, దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆసుపత్రుల యాజమాన్యాలను కలెక్టర్‌ తెలిపారు. సాధారణ ప్రసవాల శాతం పెరగని ఆస్పత్రులపై తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ తెలిపారు ఈ సమీక్షలో జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా సుబ్బారావు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎల్‌.కిరణ్‌, ఆర్‌.ఎం.ఓ రాంబాబు డా బాబు రత్నాకర్‌ రాధిక ప్రయివేటు ఆసుపత్రుల గైనకాలజిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking