జిల్లాలో 14 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించేలా చర్యలు
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి ,
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలను అధికారులందరూ సమన్వయంతో ఉండి పకడ్భందీగా నిర్వహించాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. ఈనెల 13న జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఎన్నికల అధికారులు పాపిరెడ్డి, రంగాచారి, సెక్టోరియల్ అధికారులు, నోడల్ అధికారులు, జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 14 పోలింగ్ కేంద్రాలకు గాను 8 పోలింగ్ కేంద్రాలను కీసరలో, 6 పోలింగ్ కేంద్రాలను మల్కాజిగిరిలో ఏర్పాటు చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్ సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 6,536 మంది ఉపాధ్యాయులు తమ ఓటర్లుగా ఉన్నారని వారు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ నిర్ణయించినందున అందుకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు అవసరమైన మేరకు ఆయా పోలింగ్ కేంద్రాల్లో సిద్దంగా ఉంచాలని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అధికారులకు సూచించారు. దీంతో పాటు బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ జరుగుతుందని అందుకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆయన తెలిపారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీటి వసతి, వెబ్క్యాస్టింగ్, విద్యుత్తు సౌకర్యం కల్పించాలని, మూత్రశాలలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని దీనికి సంబంధించి ఆయా కేంద్రాల్లో ఇప్పటి నుంచే అవసరమైన ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందుగానే సంబంధిత ఎన్నికల అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇతర సామాగ్రితో వెళ్ళాల్సి ఉంటుందని వారికి ప్రత్యేకంగా పోలీసు బందోబస్తుతో కూడిన బస్సులలో వెళ్ళేలా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని తదితరాలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న బ్యాలెట్ బాక్సులను ఆయా కేంద్రాలకు అవసరమైన మేర పంపించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ విషయంలో పోలీసు అధికారులు ఆయా కేంద్రాల వద్ద అవసరమైన బందోబస్తు కల్పిస్తారని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి వివరించారు. ఎన్నికల అధికారులు, సిబ్బందికి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని సమీక్ష సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఎన్నికల అధికారులు పాపిరెడ్డి, రంగాచారి, సెక్టోరియల్ అధికారులు, నోడల్ అధికారులు, జిల్లా స్థ్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.