– పెద్దంపల్లి గ్రామ రైతులు
– పాసుబుక్కుల కోసం ఏండ్లుగా అన్నదాతల ఎదురు చూపులు
– 33 ఏండ్లుగా భూములను సాగు చేసుకుంటున్నమని వెల్లడి
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 23
తాము 33 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు ఆన్ లైన్ పాస్ బుక్ ల కోసం జమ్మికుంట మండల పరిధిలోని పెద్దంపల్లి గ్రామ రైతులు ఎదురుచూస్తున్నారు. గ్రామ శివారులోని సర్వే నంబర్. 1405 లోని 118 ఎకరాల భూమిని అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు 20 గుంటల చొప్పున పంపిణీ చేశారు. డిసెంబర్ 9, 1991 న లబ్ధిదారులకు లావోని పట్టాలను ప్రభుత్వ అధికారులు అందజేశారు. నాటి నుంచి నేటి వరకు అంటే 33 ఏండ్లుగా రైతులు మోకాపై ఉండి సాగు చేసుకుంటున్నారు. ఈ భూములలో పంటల సాగు కు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జమ్మికుంట నుంచి ఎరువులను అందజేశారు. అప్పట్లో రుణాలు సైతం అన్నదాతకు ఇచ్చారు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ఐదేళ్ల ముందు నుంచి మాత్రం రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. ధరణికి సంబంధించిన నూతన పాస్ బుక్కులు తమకు ఇవ్వాలని రైతులు గత ప్రభుత్వ హయాంలో కోరారు. ఈ విషయమై అప్పటి బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు అందరికీ వినతి పత్రాలు సమర్పించారు. అయినప్పటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు జరగలేదు.

రాష్ట్రంలో ప్రభుత్వం మార్పు జరిగిన నేపథ్యంలో ప్రస్తుత సర్కారు రైతులకు న్యాయం చేయాలని, తమకు పాస్ బుక్కులు అందజేయడంతో పాటు రుణాలకు అనుమతి ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గత ప్రభుత్వంలో ఈ విషయమై ఎన్నో మార్లు స్థానిక ప్రజాప్రతినిధులకు తెలిపినప్పటికీ కనీసం గా పట్టించుకున్న దాఖలాలు లేవని రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని, న్యాయం చేసే దిశగా పనులు జరుగుతాయని ఆశిస్తున్నట్టు రైతులు వెల్లడించారు.