సమిష్టి కృషి వల్లే ఆయిల్ ఫామ్ లక్ష్యాన్ని సాధించి రాష్ట్రస్థాయిలో ప్రధమస్థానం జిల్లా కలెక్టర్ అనుదీప్

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి ఏప్రిల్ 11 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ సంవత్సరం 16 వేల ఎకరాల్లో ఆయిల్ పామాయిల్ మొక్కలు నాటాలని ఉద్యానవన శాఖ లక్ష్యం కేటాయించినట్లు చెప్పారు. కేటాయించిన లక్ష్యాన్ని సాధించినందుకు ఉద్యాన, వ్యవసాయ, ఆయిల్ఫైడ్ అధికారులను కలెక్టర్ అభినందించారు. పామాయిల్ మొక్కలు నాటే లక్ష్యం సాధించిన సందర్భంగా ఐడిఓసి కార్యాలయంలో ఉద్యాన, వ్యవసాయ, ఆయిల్ఫైడ్ అధికారులు, డ్రిప్ కంపెనీ ప్రతినిధులు కలెక్టర్ను కలిసి లక్ష్యాన్ని సాధించిన ప్రగతి నివేదికలు అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంప్రదాయ పంటలు సాగు వల్ల భూ సారం తగ్గిపోయి దిగుబడి తగ్గడంతో పాటు రైతుకు ఆదాయం కూడా రావడం లేదని గమనించామని, సంప్రదాయ పంటల నుండి వాణిజ్య పంటలవైపు రైతులు మొగ్గుచూపు విధంగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని చెప్పారు. జిల్లా యంత్రాంగం సూచనలు పాటిస్తూ రైతులు ఆయిల్పామ్కు సాగుకు మొగ్గు చూపడం చాలా సంతోషమని ఈ సందర్భంగా రైతులను అభినందించారు. ఆయిల్పామ్లో అంతర పంటలు సాగు చేపట్టి అదనపు ఆదాయం సంపాదించాలని ఆయన చెప్పారు. వ్యవసాయరంగంపై ఎంతో మంది ఆధారపడి జీవిస్తున్నారని, జిల్లాలో వ్యవసాయమే ప్రధాన ఆదాయవనరని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగం అభివృద్ధి సాధించడం వల్ల ఇతర రంగాలు సైతం అభివృద్ధిలో పయనిస్తాయని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఈ సంవత్సరం 16135 ఎకరాల్లో ఆయిల్ష్పామ్ మొక్కలు నాటడం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 16508 ఎకరాల్లో మొక్కలు నాటి బిందుసేద్యం సౌకర్యం కల్పనలో కూడా ప్రధమస్థానంలో నిలిచామని ఆయన పేర్కొన్నారు. కేటాయించిన లక్ష్యాన్ని సాధించేందుకు రైతులకు ఉద్యాన, వ్యవసాయ అధికారులు కల్పించిన అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇచ్చాయని చెప్పారు. పామాయిల్ పంటకు చీడ, పీడలు ఆశించవని, సాగు ఖర్చు తక్కువ, ఆదాయం కూడా ఎక్కువ కావడంతో ప్రభుత్వం రైతులను ఆయిల్ష్పామ్ పంట సాగుకు ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా దుమ్ముగూడెం మండలానికి చెందిన పెనుబల్లి గంగరాజు దుమ్ముగూడెం మండలంలో ప్రప్రధంగా సంప్రదాయ పంటలకు స్వస్థి పలికి ఆయిల్పామ్ పంట సాగు చేపట్టిన సందర్భంగా కలెక్టర్ శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి జినుగు మరియన్న, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఎడిఏలు రవికుమార్, లాల్సింగ్, ఉద్యాన అధికారులు శాంతిప్రియ, సందీప్, పర్యవేక్షకులు విజయ్కుమార్, ఆయిల్ఫైడ్ అధికారలు ఆకుల బాలక్రిష్ణ, అప్పారావు, రాధాక్రిష్ణ, డ్రిప్ కో ఆర్డినేటర్లు నరసింహారావు, వినయ్, బాలాజి, రఫి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking