-తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (టిడిఎఫ్)
హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీని తీసుకువచ్చి విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో విద్యారంగంలోని సమస్యలు వాటి పరిష్కారాలకు తీసుకోవాల్సిన చర్యలు అనే అంశంపై రూపొందించిన డ్రాఫ్ట్ రిపోర్టును విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపాల్ రెడ్డి, మధు కే రెడ్డి, గోనారెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం విద్యారంగం పరిస్థితి చూస్తే తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అన్నారు. విద్యార్థులకు కనీస అవగాహన లేకుండా విద్యా విధానం కొనసాగడం విచారకరమన్నారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు సైతం మూడవ తరగతి లెక్కల సైతం చేయలేక పోతున్నారన్నారు. ఇక పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు కూడా లీవ్ లెటర్ కూడా రాయాలని స్థితిలో ఉన్నారని ప్రభుత్వ నివేదికలే వెల్లడిస్తున్నాయన్నారు. ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న విద్యాసంస్థలపై విద్యాశాఖ నియంత్రణ లేనట్లు తెలుస్తోందని అన్నారు. అతిపెద్ద వ్యాపారంగా విద్యారంగం మారిపోవడం కూడా ఆందోళన కలిగించే అంశం అన్నారు. విద్యారంగానికి భారీ నిధులు కేటాయించాల్సి ఉండగా ఏడాది కేడాది నిధుల కేటాయింపు తగ్గిస్తున్నారన్నారు. కేటాయించిన నిధులను సైతం పూర్తిస్థాయిలో ఖర్చు చేయడం లేదన్నారు. దీంతో విద్యార్థులలో విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో విద్యారంగ సమస్యలపై ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి సమూల మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.