*కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
*విద్యాలయాలు, అంగన్వాడి కేంద్రాల ఆకస్మిక తనిఖీ
వేములవాడ, ఫిబ్రవరి -19
(ప్రజాబలం)
విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో విద్యను అభ్యసించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లిలోని సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.కిచెన్, స్టోర్ రూమ్, డార్మెట్రీ, తరగతి గదులు, మెనూ చార్ట్ పరిశీలించి, ఆహార పదార్థాలను సిద్ధం చేస్తుండగా,నాణ్యతను పరిశీలించారు.సిలబస్ ఎక్కడి వరకు పూర్తయింది అనే వివరాలను ఆరా తీశారు. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో విద్యను అభ్యసించాలని సూచించారు.అనంతరం శాత్రాజుపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల,అంగన్వాడీలో మధ్యాహ్న భోజనంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
అనుమతి పత్రాలతో ఇసుక తరలించాలి
ప్రభుత్వ ఇసుక రీచ్ ల నుంచి అన్ని పత్రాలను వెంట పెట్టుకొని ఇసుకను తరలించాలని కలెక్టర్ సూచించారు. వేములవాడ లో ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్ ను ఆపి వే బిల్లు, డ్రైవింగ్ లైసెన్స్ ఇతర పత్రాలను తనిఖీ చేశారు.అక్రమంగా ఇసుక తరలించే వాహనాలు సీజ్ చేయాలని ఆదేశించారు.ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక తరలించాలని సూచించారు.కార్యక్రమంలో తహసిల్దార్ మహేష్ కుమార్, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.