18 సంవత్సరాల దాటిన వారందరూ ఓటరుగా నమోదు కావాలి
ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి
……… జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి సెప్టెంబర్ 6 ప్రజ బలం ప్రతినిది:
విద్యార్థులకు ఓటు నమోదు, ఓటు హక్కు ప్రాముఖ్యతలపై అవగాహన కలిగించేందుకు జిల్లాలోని అన్ని కాలేజీలు, పాఠశాలల్లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ ఏర్పాటుచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు.
బుధవారం కలెక్టర్ఈ ఆర్ వో లు, ఏఈఆర్ఓ లు, ఎంపీ ఓ లు, ఎంఈఓ లు , హెడ్మాస్టర్ లు, కళాశాల ప్రిన్సిపల్స్, ఎన్నికల విభాగం సిబ్బంది,
ఆర్ సి ఓ లతో ఓటర్ నమోదు,ఓటు
వినియోగం, స్వీప్ ప్రచార కార్యక్రమాలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, రానున్న ఎన్నికలలో ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తప్పని సరిగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైయివేటు డిగ్రీ, జూనియర్, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యత, దాని ఆవశ్యకతపై అవగాహన కలిగించేందుకు ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
విద్యార్థులు ఇళ్ల వద్ద వారి తల్లిదండ్రులకు కూడా అవగాహన కలిగించేలా ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన ఓటు హక్కు, ఎథికల్ ఓటింగ్ పై విద్యార్థులతో చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.
అన్ని పాఠశాలలు, కాలేజీలను సందర్శించి 18 సంవత్సరాలు దాటిన వారందరూ ఓటరుగా నమోదు అయ్యారా లేదా పరిశీలించాలని, కాలేజీలలో ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క విద్యార్ధి ఓటు హక్కు కలిగివుండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
2014 -15 విద్యా సంవత్సరం నుండి 2019-20 వరకు ఎంతమంది విద్యార్థులు పదవ తరగతి పాసయ్యారన్న వివరాలను నివేదికను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఇవ్వాలని సూచించారు. ఆయా వివరాలతో అర్హత గల వారందరూ ఓటరుగా నమోదు అయింది లేనిది చెక్ చేయాలన్నారు. 18-19 సంవత్సరాల వయస్సు వారందరూ ఓటరు జాబితాలో ఉండాలన్నారు.
గ్రామ, పట్టణ స్వయం సహాయక మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా ఓటరు నమోదు, ఓటు హక్కును వినియోగించుకోవడం పై చర్చించేలా అజెండా పెట్టుకొని అవగాహన కల్పించాలని తెలిపారు.
ప్రతి గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి ద్వారా 18 సంవత్సరాలు దాటిన వారందరిని ఓటరుగా నమోదు చేయించేలా చర్యలు చేపట్టాలని డిపిఓ కు సూచించారు.
అర్హులు వందకు వంద శాతం ఓటరుగా నమోదు కావాలని, సెప్టెంబర్ 19 వరకు ఓటర్ నమోదుకు అవకాశం ఉందన్నారు.
ఫారమ్ -6 ద్వారా ఓటరు నమోదు, ఫారమ్ -7 ద్వారా ఓటరు జాబితా నుండి తొలగింపులు, ఫారమ్ -8 ద్వారా మార్పులు చేర్పులు లాంటి విషయాలను ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు.
వచ్చిన ఆయా ఫారాలు, పరిష్కరించినవి సరిచూసుకోవాలని, తిరస్కరించిన దరఖాస్తులకు సంబంధించి సరైన కారణం ఉండాలన్నారు.
జాబితాలో డూప్లికేట్ ఓటర్స్ ఉండరాదని స్పష్టం చేశారు. ఓటరు జాబితాలో వీఐపీ ఓటర్స్ మిస్ కాకుండా చూసుకోవాలన్నారు. పిడబ్ల్యుడి ఓటర్లు ఏ ఒక్కరూ మిస్ కావద్దని తెలిపారు. 80 పైబడి వయస్సు గల ఓటర్లను క్రాస్ చెక్ చేసి పరిశీలించాలన్నారు.
ఈ టెలి కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ మాధురి, ఈ ఆర్వోలు ఏఈఆర్వోలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల ఆర్ సి ఓ లు, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, డి ఆర్ డి ఓ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.