ప్రజా శ్రే యస్సుకు పర్యావరణరక్షణ వ్యూహాలే కీలకం – డాక్టర్ భారత రవీందర్ – సైన్స్ రచయిత & ఎన్విరాన్మెంటల్ ఆక్టివిస్ట్

నేడూ మన భూప్రపంచం అనేక పర్యావరణ సమస్యలను , సవాళ్లను ఎదుర్కొంటున్నది . ప్రపంచవ్యాప్తంగా ఆకస్మిక వాతావరణ మార్పులు , పర్యావరణ కాలుష్యం , గ్లోబల్ వార్మింగ్ , గ్లోబల్ కూలింగ్ ఎఫెక్ట్ , ఓజోన్ పొర క్షీణత ,గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు , ఆణుయుద్దాలు , దృవప్రాంతాలలో మంచు కరుగడం , భారీ భూకంప విస్పోటనాలు , తాగునీటి కొరత , స్వచ్చమైన గాలి అలభ్యత , ప్లాస్టిక్ వ్యర్థాల వెల్లువ , వ్యవసాయంలో విపరీతమైన రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వినియోగం , అపరిమిత పట్టణీకరణ ,కరోనా లాంటి మహమ్మారి వ్యాధులు ప్రబలడం వంటి సమస్యలు ఆందోళనకు కారణమవుతున్నాయి .ఈ సమస్యలన్నీటిని నియంత్రించి , పెరుగుతున్న జనాభా అవసరాలను తీరుస్తూ , భూగోళ సుస్థిరతను , ప్రజాశ్రేయస్సును ఎలా కాపాడుకోవాలి ! అనేవి మన ముందున్న ప్రధాన సవాళ్ళు . పరిణామక్రమంలో సుమారు 350 కోట్ల సంవత్సరాలజీవకోటీ చరిత్రలోప్రస్తుత మానవుడు ( హోమోసెపియన్స్ ) ఏర్పడి కేవలం 44 లక్షల సంవత్సరాలే అయ్యింది .నాటి నుండి జ్ఞానవిప్లవం , వ్యవసాయ విప్లవాలతో ఎదిగిన మానవుడు ప్రకృతితో సహజీవనం చేస్తూ జీవిస్తున్నాడు . కానీ పారిశ్రామిక విప్లవం , శాస్త్ర సాంకేతిక విప్లవాల నేపధ్యంలో ప్రకృతి వరణమును మరిచి కేవలం బుద్ది అవరణములో ( నాలెడ్జ్ స్పియర్ ) లో సంచరిస్తూ స్వార్థపూరిత ఆలోచనలతో , వికృతమైన , విశృంఖలమైన , విధ్వంసకరమైన ఆవిష్కరణలతో మానవుడు పర్యావరణ వినాశనానికి పాల్పడుతున్నాడు . నేడు ఎన్నో శాస్త్ర సాంకేతిక , వైద్య ఫలాలను అనుభవిస్తూ , జనన మరణాల గుట్టును విప్పే ప్రయత్నాలను సైతం చేస్తున్న ఆధునిక మానవుడు ప్రస్తుతం కరోనా అనే కంటికి కనబడని ఒక సూక్ష్మజీవి దెబ్బకు విలవిలలాడుతుండటం ఆశ్చర్యకరం . ఈ సంక్షోభానికి గల కారణాలను బుద్దిజీవులుగా , ఆలోచనపరుడైన మానవుడిగా ( హోమో ఫెబర్ ) మనం సులభంగానే అర్థం చేసుకోవచ్చును . ప్రధానంగా1 వాతావరణ మార్పులు 2 .తీవ్ర కాలుష్యం 3. మహమ్మారి వ్యాధుల ప్రబలవ్యాప్తి 4. సాంకేతిక దాడి ( టెక్నాలజీ అటాక్ ) అను అంశాలు భూమిపై మానవాళి భద్రతను మరియు మనుగడను సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి .
సంక్షోభంలో మానవాళి మనుగడ :ప్రకృతి నియమాలకు విరుద్దంగా అభివృద్ది , ఆధునికత , నవనాగరికత , లగ్జరీ లైఫ్ పేరుతో మానవుని మతిమాలిన వికృతి చర్యలతో అవసరానికి మించిన ప్రకృతి వనరుల దుర్వినియోగం వల్ల కోటానుకోట్ల సంవత్సరాల చరిత్ర గల భూమి , కేవలం గత 300 ఏండ్ల నుండి ‘ కాలుష్య కసారం ‘ గా మారుతోంది . విచక్షణా రహితంగా అడవుల నరికివేత , గ్రీన్ హౌస్ వాయువుల విడుదల , రేడియోధార్మిక వ్యర్థాలు , భూవినియోగ పద్దతుల మార్పుల వంటి మతిమాలిన చర్యలు , భూకంపాలు ,సునామీలు , అగ్ని పర్వతాల భారీ విస్పోటనాలు , వేడి గాలులు ( హీట్ వేవ్స్ ) వంటి సహజ విపత్తులు , భూతాపం వల్ల దృవాల వద్ద మంచు కరుగడం , కొన్ని ప్రాంతాలలో అతిచల్లదనం వల్ల అత్యంత వేగంగా వాతావరణ మార్పులు చోటు చేసుకొంటున్నాయి .పెరుగుతున్న ప్రపంచ జనాభా కారణంగా నీరు , విద్యుత్ , ఇందనాలు , ఖనిజ వనరులకు గిరాకీ పెరిగి తీవ్ర కాలుష్యానికి దారితీస్తున్నది . నేడు మనం పీల్చే గాలి , తాగే నీరు , తినే ఆహారం అన్నీ కలుషితమై మానవ మనుగడను ప్రశ్నిస్తున్నాయి . ఇటీవల 184 దేశాలకు చెందిన సుమారు 1700 మంది ప్రపంచ శాస్త్రజ్ఞుల బృందం సమావేశమై కాలుష్యం , పర్యావరణ విధ్వంసంపై “ సెకండ్ గ్లోబల్ వార్నింగ్ టు హ్యూమానిటీ -2017 “ పేరున భూమి ప్రమాదంలో చిక్కుకుందని హెచ్చరించిది . ప్రస్తుతం జరిగే అనుచిత వాతావరణ మార్పులను “ ఎన్విరాన్ మెంటల్ ఎమర్జెన్సీ “ గా పేర్కొంటూ, ఈ పరిస్థితిలో పెద్ద ఎత్తున మార్పులేమీ జరుగకపోతే చెప్పలేనంత విషాదాలకు దారి తీస్తుందని 2019 వ సంవత్సరంలో 153 దేశాలకు చెందిన 11000 మంది శాస్త్రజ్ఞుల బృందం హెచ్చరించిన విషయం కూడా గమనించాలి . తీవ్రకాలుష్యం కారణంగా స్త్రీ , పురుషులలో ప్రత్యుత్పత్తి అవయవాలు కుంచించుకపోవడం వల్ల పునరుత్పత్తి సామర్థ్యం ( ఫెర్టిలిటీ కెపాసిటీ ) క్రమేపీ తగ్గుతోందని ప్రముఖ అమెరికన్ పర్యావరణవేత్త డాక్టర్ షన్నా ష్వాన్ తన తాజా పుస్తకం “ కౌంట్ డౌన్ ( 2021 )” లో ఆందోళన వ్యక్తం చేసింది . నానాటికీ పెరిగిపోతున్న ఈ కాలుష్యపు ముప్పు మానవ జాతి మనుగడకే పెనుసవాల్ విసురుతోందని కూడా హెచ్చరించింది .
మానవచరిత్రలో నాటి నుండి నేటి వరకు వ్యాధి జనకాలైన బాక్టీరియా , వైరస్ లు మహమ్మారి వ్యాధులుగా మారి కోట్లాది మందిని బలిగొన్న సంఘటనలు చాలా ఉన్నాయి . క్రీ.శ 541 లో బాక్టీరియా వల్ల కలిగిన ప్లేగువ్యాధితో సుమారు 3 కోట్ల మంది చనిపోయి ఉంటారని అంచనా . వైరస్ లు ఆకస్మిక ఉత్పరివర్తనలతో తమ జెనటిక్ కోడ్ మార్చుకుంటూ రేబిస్ , ఆంత్రాక్స్ , ఏయిడ్స్ , డెంగ్యూ , స్వైన్ ఫ్లూ , బర్డ్ ఫ్లూ , చికెన్ గున్యా , ఎబోలా , జికా , హంటా , సార్స్ మెర్స్ వంటి రూపాంతరం చెందిన వైరస్ వ్యాధుల వల్ల లక్షలాది మంది బలైనారు . ఇప్పటికీ 100 ఏండ్ల క్రితం క్రీ.శ. 1918 లో మొదలైన స్పానిష్ ఫ్లూ మహమ్మారి వల్ల సుమారు 5 కోట్ల మంది చనిపోయారు . తాజాగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ ( కోవిడ్–19) వల్లఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 68 లక్షలకు పైగా మరణాలు సంభవించాయని గణాంకాలు చెబుతున్నాయి . తాజాగా బిఎఫ్ 7 సబ్ వేరియంట్ వ్యాప్తి తో చైనా లో ఫోర్త్ వేవ్ ప్రారంభమైందని , సరైన చర్యలు , తగు జాగ్రత్తలు తీసుకోకుంటేమన దేశంలోనూ వ్యాప్తి చెంది ఎంతో ప్రాణ నష్టాన్ని చవిచూడవల్సివస్తుందని అంటువ్యాధి నిపుణులు అంచనా వేస్తున్నారు .నేడు మనం టెక్నాలజీ యుగంలో బతుకుతున్నాం . మన బౌతీక జీవనం సంపూర్తిగా శాస్త్ర సాంకేతిక విజ్ఞానం పైనే ఆధారపడిన అపూర్వ కాలం ఇది . టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించ గలిగితే అది మన సమాజనికి సమగ్ర సంపదనిస్తుంది మరియు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది . లేకపోతే టెక్నాలజీ మన మీద దాడి చేసి సమాజాన్ని అల్లకల్లోలం చేస్తుంది . ఈ క్రమంలో 21 వ శతాబ్దంలో బయో టెక్ , ఇన్ఫో టెక్ ల కలయిక వచ్చే సవాల్లే పెద్దవి . అణుయుద్దాలు , రసాయనిక ఆయుధాలతో దాడి ( కెమికల్ వార్ ) , సూక్ష్మజీవుల దాడి ( బయో వార్ ) , సైబర్ దాడి , ఆగ్రోటెర్రరిజం , ఫుడ్ టెర్రరిజం లాంటివన్నీ టెక్నాలజీ ముసుగులో జరుగుతున్న దాడులే . భవిష్యత్తులో వీటి వల్ల మానవ జాతికి ప్రమాదం పొంచి ఉన్నది . “ మనవునిలో విజ్ఞానంతో పాటు వివేకం ( విజ్డమ్ ) పేరుగక పోతే ఆ విజ్ఞానం పెను విషాదాన్నే మిగుల్చుతుంది “ అని చెప్పిన బ్రిటిష్ ఫిలాసఫర్ బట్రెండ్ రస్సెల్ మాటలు గుర్తెరిగి మసులుకోవాలి . లేకుంటే టెక్నాలజీ దాడిలో మానవాళికి సంక్షోభం తప్పదు .
ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు ప్రత్యక్ష , పరోక్ష కారణం భూతాపం అని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు . ఈ సందర్భంగా ప్రమఖ అమెరికన్ ఆస్ట్రో ఫిజిసిస్ట్ మరియు నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుడు డాక్టర్ కేటీ మాక్ తన తాజా పుస్తకం ‘ది ఎండ్ ఆఫ్ ఎవ్రి థింగ్ ( 2020 )‘ లో విశ్వవినాశనం గూర్చి… “ హీట్ డెత్ ప్రక్రియ ద్వారా విశ్వం వ్యాకోచంచి , వ్యాకోచించి సంకోచిస్తుంది , అన్నీ క్షీణిస్తాయి , కాంతి హీనమవుతాయి “ అని చెప్పాడు. మనిషి మనుగడ పరిమితిని మించి హీట్ వేవ్స్ వీచే ప్రపంచదేశాలలో మొదటి దేశంగా భారత్ మారవచ్చని , రానున్న రోజుల్లో మనం తట్టుకోలేనంతగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని , ఈ వేడిగాలులు భారత ఉపఖండం ఆర్థిక ఉత్పాదకతను కూడా దెబ్బ తీస్తుందని ఇటీవల విడుదలైన వరల్డ్ బ్యాంక్ నివేదిక తెలిపింది . ప్రకృతిని కాపాడకుండా , పునరుద్దరించకుండా భూతాపొన్నతిని 1.5 డిగ్రీలకు పరిమితం చేయడం అసాధ్యమని కెనడా జీవవైవిద్య సదస్సు – 2022 ( కాప్-15 ) హెచ్చరించింది . ఇప్పటికైనా పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి , కృషి చేయడం అత్యంత అవశ్యమని వరల్డ్ ఎకనామిక్ ఫోరం “ వాతావరణ మార్పులు – భవిష్యత్తు విపత్తులు “ పేరున జరిపిన సర్వే రిపోర్ట్ -2022 లో పేర్కొన్నది . కనుక పాలకులు మరియు ప్రజలు సమిష్టిగా పర్యావరణ రక్షణ వ్యూహాల అమలుకు , ఆచరణకు నిరంతరం కృషి జరపాలి .
వ్యూహాల ఆచరణే ముఖ్యం: 2050 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరనుందని అంచనా ! మన దేశ జనాభా 160 కోట్లకు చేరుతుందని గణాంకాలు చెబుతున్నాయి . వీరి అభివృద్ది , అవసరాలు తీర్చడానికి ఇప్పటికన్నా ప్రకృతి వనరులను ఎక్కువగా వినియోగించవల్సి ఉంది . ఈ తరుణంలో మన లక్ష్యాల తీరును సమీక్షించుకొంటూ దేశాలు – ప్రజల మద్య సమ్మిళితాన్ని ప్రోత్సహించే పర్యావరణ రక్షణ వ్యూహాలను అమలు పరిచే అవకాశాలను సంపూర్ణంగా ఉపయోగించుకోవాలి . ప్రస్తుత పర్యావరణ విపత్కర పరిస్థితులనేపధ్యంలో పాలకులు మరియు ప్రజలు పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ నష్టాన్ని తామే కొని తెచ్చుకొంటున్న ‘ భస్మాసుర ప్రవృత్తి ‘ ని విడనాడాలి . ప్రభుత్వాలు ప్రకృతి పరంగా సహజ క్రియలు , హరిత సాంకేతిక ఆవిష్కరణలు , పర్యావరణ పునరుద్ధరణ , పున : ప్రతిష్టకు వినూత్న ఆలోచనలను ప్రోత్సహించాలి . కర్బన ఉద్గారాల ప్రభావాన్ని తగ్గించే విధంగా హరిత ఉదజని భారీ విస్తరణపై భారత్ దృష్టి పెట్టి ప్రపంచ దేశాలకు మార్గదర్శకం కావాలి . అడ్డు అదుపు లేకుండా వాడబడుతున్న బొగ్గు , శిలాజ ఇంధనాల వినియోగాన్ని దశల వారీగా ఎత్తివేసే దిశగా నిరంతరం కృషి జరుగాలి . సంప్రదాయ ఇంధన పొదుపుపై మరియు సంప్రదాయేతర ఇంధన వనరులైన సౌర , పవన , అలల శక్తి వనరుల వినియోగంపై సామాన్య జనానికి అవగాహనాకార్యక్రమాలను ముమ్మరం చేయాలి .
మన దేశంలో పర్యావరణానికి హాని కలుగకుండా పంటల ఉత్పాదకతను మెరుగుపరచడానికి ఉద్దేశించిన నిత్యహరితవిప్లవం కోసం టెక్నాలజీని అభివృద్ది పరచాలి . సేంద్రీయ వ్యవసాయం , హరిత వ్యవసాయం , మైక్రో ఆర్గానిజం ఆధారిత వ్యవసాయం , పర్యావరణహిత వ్యవసాయం మొదలగు విభిన్న స్వావలంబన విధానాలు అందుబాటులో ఉండే “ డూ – ఎకాలజీ “ వైఖరిని ప్రజలలో పాదుకొల్పాలి . తప్పని సరిగా వర్షపు నీటిని నిల్వ చేయడం , రొటేషన్ పద్ధతిలో ఖరీఫ్ , రబీ కాలాలలో చిక్కుళ్లు , కంది ,పెసర తదితర పంటలు వేయాలి . నీటి అవసరం తక్కువగా ఉండే రాగి , సజ్జ లాంటి తృణ ధాన్యాలు , నూనెగింజలు , పశుదాణా వంటి సంప్రదాయ పంటలను విత్తన మార్పిడి కోసం పునరుద్దరించి ఉత్పాదకతను పెంచాలి .దీనివల్ల రైతుకు , దేశానికి విజయం కలుగుతుంది. స్వచ్చభారత్అభియాన్ లాంటి పర్యావరణ పారిశుద్దకార్యక్రమాన్ని నిరంతరకార్యక్రమంగా నిర్వహించి , దేశాన్ని క్లీన్ ఇండియా గా మార్చాలి . దేశంలోనే అతిపెద్ద హరిత కార్యక్రమం “ తెలంగాణకు హరితహారం “ వంటి మెగా ప్లాంటేషన్ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించి దేశాన్ని హరితమయం చేయాలి . “ మిషన్ కాకతీయ పథకం “ స్పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్న చెరువులను అభివృద్ది పరిచి సాగునీటిని అందించి దేశాన్ని సస్యశ్యామలం చేయాలి . జల్ జీవన్ మిషన్ , మిషన్ భగీరథ కార్యక్రమాల ద్వారా దేశ ప్రజలందరికీ స్వచ్చమైన తాగునీరు అందించే కార్యక్రమాలను ముమ్మరం చేయాలి . మన దేశంలోని ప్రతి పంచాయితీ కూడా తనదైన సామాజిక , ఆర్థిక , సాంస్కృతిక , పర్యావరణ పరిస్థితులకు అనువైన లక్ష్యాలను సాధించడానికి సొంత ప్రణాళికలను అభివృద్ది చేసుకోవాలి .“ ఆలోచించు – ఆవిష్కరించు – ఆచరించు “ అనే నినాదంతో పర్యావరణ రక్షణ వ్యూహాల ఆచరణకు ప్రతి పౌరుడు ముందడుగు వేయాలి .ఇలాంటి పర్యావరణహిత వ్యూహాల పట్ల ఆవగాహన , అమలు , ఆచరణలు మానవ మనుగడకు , ప్రజాశ్రేయస్సుకు ఆలంబనగా నిలుస్తాయి .
– వ్యాస రచయిత : డాక్టర్ భారత రవీందర్ ( 9912536316 )

Leave A Reply

Your email address will not be published.

Breaking