జగిత్యాల, ఫిబ్రవరి 8: నర్సింగపూర్ రైతు గడ్డం జలపతి రెడ్డి మృతికి కారణమైన న్యాయవాది దామోదర్ రావు ను వెంటనే అరెస్టు చేయాలని బిఎస్పీ జిల్లా అధ్యక్షులు పుప్పాల లింబాద్రి, జిల్లా ఇంచార్జ్ మద్దెల నారాయణ జిల్లా ఎస్పీకి ఇచ్చిన వినతిపత్రం లో కోరారు. బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ రైతు జలపతి రెడ్డి కుటుంబీకులను పరామర్శించిన అనంతరం ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు బిఎస్పీ నేతలు జిల్లా ఎస్పీ భాస్కర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పుప్పాల లింబాద్రి, నారాయణ లు మాట్లాడుతూ రైతు జలపతి రెడ్డి కుటుంబానికి బిఎస్పీ పార్టీ అండగా ఉంటుందని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రకటించారన్నారు. మృతుడు జలపతి రెడ్డి తన వీడియో కాల్ లో వకిల్ దామోదర్ రావు చేసిన అన్యాయం క్లుప్తంగా పేర్కొన్నారన్నారు. జలపతిరెడ్డి మృతికి కారణమైన దామోదర్ రావు ను వెంటనే అరెస్టు చేయాలని లేకుంటే బిఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే రైతు జలపతిరెడ్డి కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. వీరి వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లంపల్లి సంపత్ కుమార్, ఉపాధ్యక్షుడు దేవిసింగ్ రాథోడ్, జిల్లా బివిఎఫ్ కన్వీనర్ తిరుపతి తోపాటు పలువురు ఉన్నారు.