…..జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి,డిసెంబర్ 29 ప్రజ బలం ప్రతినిది: డి అశోక్ అందోల్- జోగిపేట మున్సిపాలిటీలోని అంబేద్కర్ కాలనీ(5వ వార్డ్) లో శుక్రవారం నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభయ హస్తంలోని గ్యారంటీల అమలుకు ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లాలని, ప్రభుత్వ అధికారులు గడప,గడపకు వెళ్లి దరఖాస్తులు ఇచ్చి స్వీకరించడానికి ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
జనవరి 6వ తేదీ వరకు అర్హులందరూ గ్రామ/వార్డ్ సభలలో పాల్గొని దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దరఖాస్తులను స్వీకరిస్తూ, దరఖాస్తులను నింపేందుకు అవసరమైన సలహాలు సూచనలు అందించాలని అధికారులకు ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తుల స్వీకరణను , ఆయా కౌంటర్లను తిరిగి పరిశీలించారు.ప్రజల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను, మహిళలకు, దివ్యాంగులకు, ఇతర దరఖాస్తుల కొరకు ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కౌంటర్లలో సిబ్బందికి దరఖాస్తుల స్వీకరణ, రిజిస్టర్లో నమోదు చేయడం, తదితర పలు అంశాలపై సూచనలు చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి వార్డు సభలో ఎంతమంది వైద్య సహాయం పొందారని ఆరా తీశారు. వారి సేవలను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు.
కలెక్టర్ వెంట రెవిన్యూ డివిజనల్ అధికారి పాండు, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, తహసిల్దార్ ఆంథోనీ, సంబంధిత శాఖల సిబ్బంది, వార్డ్ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
